బుధవారం 27 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:17:25

ప్రభుత్వ దవాఖానల్లోనేటి నుంచి ఓపీ

ప్రభుత్వ దవాఖానల్లోనేటి నుంచి ఓపీ

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిపోయిన ఓపీ సేవలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. జనరల్‌ ఓపీ సేవలతో పాటు ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను సిద్ధం చేశారు. గ్రేటర్‌ పరిధిలోని మొత్తం 11 బోధనాసుపత్రుల్లో గాంధీ మినహా 10 ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.  ఉస్మానియా దవాఖానలో 21 విభాగాల్లో ఓపీ సేవలను పునరుద్ధరిస్తున్నారు.             

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : కరోనా వ్యాప్తి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సర్కార్‌ దవాఖానల్లో జనరల్‌ ఓపీ సేవలు, శస్త్రచికిత్సలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరిని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా మొన్నటి వరకు అన్ని ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో (టీచింగ్‌ హాస్పిటల్స్‌) కేవలం అత్యవసర ఓపీ సేవలు, ఎంపిక చేసిన అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం, లాక్‌డౌన్‌లో సడలింపులు కల్పిస్తుండటంతో సర్కార్‌ దవాఖానలు సైతం పూర్తిస్థాయిలో సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డా.రమేశ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 

గాంధీ దవాఖాన మినహా..

గ్రేటర్‌ పరిధిలో 11 టీచింగ్‌ హాస్పిటల్స్‌ ఉండగా గాంధీ మినహా మిగతా 10 దవాఖానల్లో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావల్సిందిగా డీఎంఈ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉస్మానియా, నిలోఫర్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, పేట్లబుర్జ్‌ ప్రసూతి దవాఖాన, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి దవాఖాన, కోఠి ఈఎన్‌టీ, ఎర్రగడ్డ ఛాతి వైద్యశాల, ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన, నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌ తదితర దవాఖానలు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో రోగులకు వైద్యసేవలు అందించనున్నాయి. ముఖ్యంగా అన్ని విభాగాలకు చెందిన జనరల్‌ ఓపీ సేవలు, వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు తదితర సేవలన్నీ ఇక నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. 

ప్రతి దవాఖానలో ఫీవర్‌ క్లినిక్‌

కరోనా నేపథ్యంలో ప్రతి బోధన దవాఖానలో ఫీవర్‌ క్లినిక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డీఎంఈ ఆదేశించారు. టీచింగ్‌ హాస్పిటల్స్‌కు వచ్చే రోగుల్లో ఎవరికైన జ్వరం, జలుబు వంటివి ఉంటే వారిని ఇతర రోగులతో కలువకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫీవర్‌ క్లినిక్‌లో జ్వరపీడితులకు చికిత్స అందించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలు జరిపించి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం రోగిని కొవిడ్‌-19 నోడల్‌ కేంద్రాలైన గాంధీ, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలకు తరలించాలని, అనుమానితులను సరోజినిదేవి కంటి దవాఖానలోని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.  

కరోనా నియమాలు తప్పనిసరి

కరోనా వ్యాధి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దవాఖానకు వచ్చే రోగులు తప్పనిసరిగా కరోనా నియమాలు పాటించాల్సిందేనని డీఎంఈ స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్‌ వంటి నియమాలు పాటించాలన్నారు. నియమాలు పాటించని వారిని దవాఖానలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయా దవాఖానల సిబ్బంది సైతం పూర్తి స్థాయి పర్యవేక్షణతో పాటు వారు కూడా నియమాలు పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా దవాఖానల్లోని ఓపీ బ్లాక్‌లు, వైద్యపరీక్షల కౌంటర్లు, ఇతర ప్రదేశాల్లో గుంపులు, రద్దీ లేకుండా దవాఖానల సూపరింటెండెంట్‌లు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు తప్పనిసరిగా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ధరించాలని సూచించారు.


logo