మంగళవారం 26 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:15:03

బిల్లా దాఖలను కలిపేసుకున్నారు..

బిల్లా దాఖలను కలిపేసుకున్నారు..

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: రాజీవ్‌ రహదారి పక్కనే.. ఔటర్‌ రింగురోడ్డును ఆనుకొని ఇద్దరికి 15 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పక్కనే 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ రెండు ఒకే సర్వే నంబర్‌లో ఉన్నాయి. దీంతో అధికారులను మచ్చిక చేసుకుని వారికున్న 15 ఎకరాల్లో 26 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారు. అంతేకాకుండా మొత్తం 41 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్‌ పెట్టారు. ఇదంతా సమైఖ్యపాలనలో నలబై ఏండ్ల కిందట జరిగిన ఓ ఇద్దరు భూ‘ప్రబుద్ధుల’ కథ. ‘నన్నెవరు చూడట్లేదనుకుని పిల్లి ఉట్టిమీది పాలుతాగిన చందంగా.. నలబై ఏండ్లు తమ కబ్జాలోనే ఉంది.. ఎవరేమి చేస్తారులే అనుకొని ఆ ఇద్దరు భూస్వాములుగా చెప్పుకుంటూ తిరిగారు. కానీ కొద్ది రోజుల కిందట పట్టాభూమితోపాటు ఆక్రమిత ప్రభుత్వభూమిని ఓ రియాల్టర్‌కు డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. కానీ ఇప్పుడున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ పని చేస్తుంది తెలంగాణ అధికారులని గుర్తించలేకపోయారు సదరు కబ్జాదారులు. ఆక్రమిత భూమిలో వెంచర్‌కు అనుమతులివ్వాలంటూ సదరు డెవలపర్‌ దరఖాస్తు చేశాడు. తీగలాగితే డొంక కదలినట్లుగా ప్రభుత్వ ఆదేశాలు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శామీర్‌పేట తహసీల్దార్‌ రంగంలోకి దిగి సర్వే నిర్వహించడంతో దిమ్మతిరిగే కబ్జా బాగోతం బట్టబయలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పరాధీనమైన రూ.120కోట్ల ప్రభుత్వ భూమి చెరవీడింది. నలబైఏండ్ల పాటు కబ్జాదారుల కబంధహస్తాల్లో నలిగిన 26 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 

ఇది ‘బిల్లా దాఖల’ భూమి...

శామీర్‌పేట మండల పరిధిలోని తూంకుంట గ్రామ సర్వే   నం బర్‌ 164లో ఖాస్రాపహాని ప్రకారం మొత్తం 129.9 ఎకరాల భూమి ఉంది. ఇందులో సర్వే నెంబర్‌ 164/1లో 114.9 గుంటల భూమి ఫారెస్ట్‌ శాఖ ఆధీనంలో ఉండగా మిగిలిన మరో 15 ఎకరాల భూమి ఇద్దరు ప్రైవేటు వ్యక్తులదిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ అక్కడ మొత్తంగా 170.9 ఎకరాల భూమి ఉంది. కానీ ఇందులో సుమారు 26 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు (nill entry). ఇలాంటి భూములను బిల్లా దాఖలు భూమిగా రెవెన్యూ అధికారులు పేర్కొంటా రు. దీనిని అలుసుగా తీసుకున్న ఇద్దరు వ్యక్తులు మిగిలిన 26 ఎకరాలను కూడా నాలబై ఏండ్లుగా కాస్తూ చేసుకుంటున్నారు. అయితే గతంలో సమగ్ర భూసర్వే నిర్వహించిన సమయంలో ఈ భూమికి ఏ సర్వే నంబర్‌ను కేటాయించలేదా (not acco unt for during the survey oparations)? లేక గతం లో ఎవరైన తొలిగించారా ? అనే అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. అలాగే ప్రభుత్వ భూమికి టిప్పన్‌(కొలుతలు) ఉండవు. దీనిని అలుసుగా తీసుకొని కబ్జాదారులు తమ భూమిలో ప్రభుత్వ భూమిని కలిపేసుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఫెన్సింగ్‌ నిధుల కోసం లేఖ...

నలబైఏండ్లపాటు కబ్జాలో ఉన్న  26 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు నిర్ణయించడంతోపాటు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నుంచి రూ.120 కోట్ల విడుదల చేయాలని శామీర్‌పేట తహసీల్దార్‌ గోవర్ధన్‌ కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ భూమిని ప్రస్తుతం రైతులకు వరిధాన్యం పోసుకునేందుకు ఇచ్చామని, ప్రభుత్వ తదుపరి ఆదేశాల మేరకు భవిష్యత్తులో ప్రజల అవసరార్థం కేటాయిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

బట్టబయలైంది  ఇలా..

కేవలం 15 ఎకరాల భూమికి మాత్రమే ఇద్దరు వ్యక్తులకు పట్టాలున్నప్పటికీ కబ్జాలో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమిని తమభూమిగానే పేర్కొంటూ ఓ డెవలపర్‌కు వెం చర్‌ నిర్మాణం కోసం ఇచ్చారు. దీంతో సదరు డెవలపర్‌ ఆ భూమిలోని చెట్లను, బండలను తొలగించి చదును చేయడంతోపాటు వెంచర్‌ నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ, ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం స్థానిక రెవెన్యూ అధికారులకు లేఅవుట్‌ కాపీని జతచేస్తూ దరఖాస్తు సమర్పించాడు. సదరు దరఖాస్తుపై స్థానిక తహసీల్దార్‌ కీసర ఆర్డీవోతో చర్చించి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ సదరు భూమిపై సమగ్ర భూ సర్వే చేయాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులతోపాటు మండల తహసీల్దార్‌ గోవర్ధన్‌ను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 164 సర్వే నంబర్‌లోని ఉన్న మొత్తం స్థలంపై సర్వే చేపట్టారు. దీంతో 15 ఎకరాల పట్టాదారులైన ఇద్దరు వ్యక్తుల 41 ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు తేలింది. వెంటనే సదరు కబ్జాదారులకు, డెవలపర్‌కు నోటీసులు జారీ చేసి అక్రమంగా కబ్జాలో ఉన్న సుమారు 26 ఎకరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు శామీర్‌పేట తహసీల్దార్‌ గోవర్ధన్‌ ఈ 26 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే 164 సర్వే నంబర్‌లో మరో 26 ఎకరాల బిల్లాదాఖల భూమి ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ సమాచారం హెచ్‌ఎండీఏ అధికారులకు కూడా ఇచ్చినట్లు స్థానిక రెవెన్యూ అధికారులు తెలిపారు. 


logo