గురువారం 28 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:11:33

బలపమిచ్చి.. పాఠాలు చెప్పి..

బలపమిచ్చి.. పాఠాలు చెప్పి..

ప్రతిరోజూ 70 మందికి... 

సికింద్రాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు తిని  కూర్చోవడం  వల్ల కలిగే ప్రయోజనం  ఏం ఉండదని, ఈ సమయాన్ని జీవిత కాలం  ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని భావించిన డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ కార్మికులకు అక్షరాలు నేర్పుతున్నారు. కరోనా కారణంగా వలస కార్మికులు, నిరాశ్రయులకు లాలాపేట్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్టేడియంలో సుమారు  3 వందల మందికి ఆశ్రయం  కల్పించారు. భోపాల్‌కు చెందిన పెద్దలు 40 మంది, పిల్లలు 40 మంది మలక్‌పేట్‌లో ఉండేవారు.  అక్కడి నుంచి మెట్టుగూడలోని ఆలుగడ్డబావి వద్ద రైల్వే స్థలంలో గుడిసెలు వేసుకొని ఉండగా,  డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఆదేశాల మేరకు వారికి స్టేడియంలో ఆశ్రయం కల్పించారు. అందులో అనేక మంది నిరక్షరాస్యులు ఉండడంతో డీసీ రవికుమార్‌ ప్రత్యేక చొరవ చూపి పిల్లలు, పెద్దలకు చదువు చెప్పడం ప్రారంభించారు. వారికి అవసరమైన పలకలు, చాక్‌పీసులు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు సమకూర్చారు. విద్యపై ఆసక్తి కల్పించి అక్షరాలు నేర్పిస్తున్నారు.  సుమారు 70 మందికి విద్యదానం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆహార వసతితోపాటు చదువులు చెబుతున్నారు. 

అందుకే చదువు చెబుతున్నా.. 

కష్టపడి పనిచేసిన వలస కార్మికులకు కనీసం శ్రమ తగ్గ ఫలితం పొందామో లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారి అమాయకత్వాన్ని  ఆసరా చేసుకొని కొందరు సరైన కూలీని ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. కష్టపడి పనిచేయడం తప్ప...వారికి మోసాన్ని గుర్తించడం తెలియదు. అందుకే వారికి విద్య   నేర్పాలనుకున్నాను .

-రవికుమార్‌, డిప్యూటీ కమిషనర్‌


logo