శనివారం 30 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:11:30

కుంచె పోరు

కుంచె పోరు

కరోనా మహమ్మారిపై ఒక్కొక్కరూ ఒక్కోలా సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు.  అలా ఓ చిత్రకారుడు తన కుంచెతో మహమ్మారిపై యుద్ధం ప్రకటించాడు. ఆలోచింపజేసే పెయింటింగులు వేసి.. సమాజోద్ధరణకు పాటుపడుతున్నారు. హైదర్‌షా కోట్‌కు చెందిన మహేశ్వరం నరహరి తన కళతో కొవిడ్‌పై పోరు సల్పుతున్నారు. తాను గీసిన 101 చిత్రాలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌  తదితర ఆన్‌లైన్‌ మాధ్యమాలే వేదికగా చేసుకొని.. వందలాది మందికి ప్రాణాంతకమైన రక్కసి నుంచి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

-సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ 

నరహరి గీసిన చిత్రాల్లో ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. మింగేస్తున్న కరోనా వైరస్‌ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నది. మన భారతాన్ని పదిలపర్చుకొని అక్కున చేర్చుకొని సురక్షితంగా ఉంచుకోవాలనే మరో కళాఖండం మరింత ఆకర్షిస్తున్నది. వైరస్‌ సోకకుండా రాష్ట్రం చుట్టూ లక్ష్మణ రేఖ గీస్తూ, ప్రజలందరికీ కేసీఆర్‌ గొడుగు పడుతున్నట్లు అద్భుతంగా ఓ చిత్రాన్ని గీశారు నరహరి. కేసీఆరే.. తెలంగాణ.. తెలంగాణ అంటేనే కేసీఆర్‌ అన్నట్లు మరో చిత్రం.. సీఎం మాటలు, సూక్తులు ఒక తెలంగాణకే కాకుండా యావత్‌ ప్రపంచానికే ఒక కోటగోడ లాంటివన్నట్లు ఇంకో చిత్రాన్ని గీశారు. కేసీఆర్‌ జన్మ దినోత్సవం సందర్భంగా 6 అడుగుల 6 అంగుళాల ఆయన చిత్రపటాన్ని తన నోటితో వేశారు.  తన ఒంటిపై తానే కేసీఆర్‌ చిత్రపటాన్ని గీసుకొని రంగులద్ది ఒక ప్రత్యేక కళా ఖండంగా మలిచి ఆ మహానేతపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 

అనేక అవార్డులు..  

కొన్ని సంవత్సరాలుగా చిత్రకళ, పెయింటింగ్‌, డ్రాయింగ్‌ విభాగాల్లో వెలుగొందుతున్న మహేశ్వరం నరహరి...పలు రకాల పెయింటింగ్‌ పోటీల్లో ఎన్నో అవార్డులను గెలుపొందారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందారు. 

 ప్రజలకు అవగాహన కల్పించేందుకే...

యాదాద్రి జిల్లా కొరటికల్‌ గ్రామానికి చెందిన మహేశ్వరం రామచంద్రయ్య అనే చిత్రకారుడి కుమారుడిని. మా నాన్న నుంచే ఈ కళ నాకు అబ్బింది. నాన్న పెయింటింగ్స్‌ వేయడమే కాకుండా శిల్పాలను కూడా చెక్కుతారు. మా గ్రామానికి తెలంగాణ తల్లిని చెక్కి బహూకరించారు. నేను జేఎన్టీయూలో బీఎఫ్‌ఏ చేశాను. టీచర్‌ ట్రైనింగ్‌ కూడా చేశాను. ప్రైవేటు పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పని చేస్తున్నాను. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుతల వారీగా తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రత్యేక కళా ఖండాలను గీయాలనే దృఢ సంకల్పం ఏర్పడింది. అలా  కరోనాపై 101 చిత్రాలను ఈ నెలన్నర రోజుల్లో గీశాను. వాటిని చూసి ప్రజలు కొంతవరకైనా మారుతారన్న నమ్మకంతోనే ఈ కళాత్మకమైన చిత్రాలను రూపొందించాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోడీలు చెబుతున్న సూచనలు మనమంతా పాటించి తీరాలి. 

 - మహేశ్వరం నరహరి


logo