ఆదివారం 31 మే 2020
Hyderabad - May 18, 2020 , 02:11:28

సేవలోనే ఆత్మ సంతృప్తి

సేవలోనే ఆత్మ సంతృప్తి

మణికొండ:గద్వాల బుర్జూ సాయినగర్‌ ప్రాంతానికి చెందిన కందుల శ్రీనివాస్‌రెడ్డి, శ్రవంతి దంపతులు 25 ఏండ్లుగా వైద్య సేవలందిస్తున్నారు. కొన్నాళ్ల కిందటే మణికొండకు వచ్చి స్థిరపడ్డారు.   ‘దాన్వి హెల్త్‌కేర్‌' సంస్థను ఏర్పాటు చేసి ప్రతి వీకెండ్‌లో వైద్యశిబిరాలు నిర్వహించేవారు. అలా 250 వరకు శిబిరాలు ఏర్పాటు చేసి  వైద్యులతో చికిత్సలు అందించారు.

లాక్‌డౌన్‌ కారణంగా... 

లాక్‌డౌన్‌ కారణంగా వలస జీవులతో పాటు పేద, మధ్య తరగతి సామాన్య ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడితే వైద్యసేవలు అందించే వీలు లేకుండా పోయింది. ముఖ్యంగా మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో కొనసాగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పనులు చేసుకునే వలస కార్మికులు 50  రోజులకు పైగా ఇక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ దంపతులు ముందుకొచ్చారు. వివిధ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులతో  ఉచిత వైద్య శిబిరాలను సొంత ఖర్చులతో నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో 17 ఉచిత వైద్య శిబిరాల ద్వారా సుమారు 9వేల మంది వలస కార్మికులకు సేవలందించినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. logo