గురువారం 28 మే 2020
Hyderabad - May 17, 2020 , 01:58:05

ప్రధాన దారుల్లో సేవలకు ఆర్టీసీ సిద్ధం

ప్రధాన దారుల్లో సేవలకు ఆర్టీసీ సిద్ధం

  •  ప్రధాన రూట్లలో బస్సులు  నడిపేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ సిద్ధం  
  •  బ్రాంచ్‌ రూట్లలో నడవని బస్సులు 
  • ప్రతి బస్టాప్‌కు రెండు షిప్టుల్లో  నలుగురు కండక్టర్లు
  • అక్కడే టికెట్‌ ఇష్యూతో  పాటు మనీ కలెక్షన్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ఎత్తివేతతో పాటు ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ప్రధాన రూట్లలో బస్సులు నడిపేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ సిద్ధ్దమవు తున్నది.అయితే కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడడంతో బస్సులోని సీట్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లపై కరో నా ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 బస్సులన్నీ ప్రధాన రూట్లలోనే..

గ్రేటర్‌ ఆర్టీసీ పరిధిలోని 29డిపోల నుంచి నడిచే బస్సులన్నీ ప్రధాన మార్గాల్లోనే ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి. బ్రాంచ్‌ రూట్లు( ప్రధాన రూట్లకు అనుసంధానంగా కాలనీలకు నడిచే బస్సులను) నిలిపివేయనున్నారు. భౌతిక దూరం పాటించేందుకు బస్సుల్లో 70 మందికి బదులుగా 30 మంది మాత్రమే ప్రయాణించనున్నారు. 

గ్రౌండ్‌ బుకింగ్‌లు..ప్రతి స్టేజీకి ఇద్దరు కండక్టర్లు

 గతంలో బస్సు ఎక్కగానే కండక్టర్‌ టికెట్‌ ఇచ్చేవారు. కరోనా నేపథ్యంలో ప్రతి స్టేజీ వద్ద టికెట్‌ ఇచ్చేందుకు రెండు షిప్టుల్లో ఇద్దరు కండక్టర్లను నియమిస్తున్నారు. వీరిలో ఒక కండక్టర్‌ టికెట్‌ ఇవ్వడంతో పాటు డబ్బులు వసూలు చేస్తారు. మరో కండక్టర్‌ బస్సు దిగే ప్రయాణికులు వారు ఎక్కిన స్టేజీలో టికెట్‌ తీసుకున్నారో లేదో పరిశీలి స్తారు.కండక్టర్ల సంఖ్యను కూడా అవసరాన్ని బట్టి పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవర్‌ కూడా డ్రైవర్‌ డోర్‌ నుంచే బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ప్యాసింజర్‌ డోర్‌ నుంచి ఎక్కితే చర్యలుంటాయి. రెండు షిప్టులుగా కండక్టర్లు, డ్రైవర్లను ఉపయోగించనున్నారు.  ప్రతి రూట్‌ బస్సులకు వేర్వేరుగా కండక్టర్లు టికెట్‌ ఇస్తారు.ప్యాసింజర్లు ముందు ద్వారం నుంచే బస్సు దిగాల్సి ఉంటుంది.

కూర్చునే సీట్లపై రైట్‌ అండ్‌  రాంగ్‌ మార్కింగ్‌

ప్రయాణికులు బస్సు ఎక్కగానే  ఏ సీట్లో కూర్చోవాలనే అంశంపై కూడా ఆర్టీసీ స్పష్టత ఇవ్వనుంది. సీట్లపై రైట్‌ అండ్‌ రాంగ్‌ మార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు.రైట్‌ మార్కు ఉన్న సీటుపై ప్రయాణికుడు కూర్చోవాల్సి ఉండగా, రాంగ్‌అనే సింబల్‌ ఉన్న సీటులో కూర్చోవడానికి అనుమతి లేదు. అయితే ఇద్దరు కూర్చునే విధంగా డిజైన్‌ చేయబడిన ఆర్టీసీ బస్సు సీట్లలో కిటికీ పక్కన కూర్చోవడానికి ప్రయాణికులకు అనుమతిస్తారు.వీరితోపాటు సీట్ల మధ్యలో(గ్యాంగ్‌వే)లో ఒక్క ప్రయాణికుడికి స్టాండింగ్‌ చేసే అవకాశం ఇస్తారు. త్వరలో ఈ విధంగా గ్రేటర్‌ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండనుంది. 


logo