గురువారం 28 మే 2020
Hyderabad - May 17, 2020 , 01:57:56

వలస కూలీలకు వెన్నుదన్నుగా..

వలస కూలీలకు వెన్నుదన్నుగా..

కరోనా నేపథ్యంలో నగర పేదలు, వలసకూలీలు ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తున్నది. ఒక్క కడుపు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కడుపునిండా అన్నం పెట్టడంతోపాటు నెల ఖర్చులకు డబ్బులు కూడా అందించింది. దీనికోసం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా బియ్యం, డబ్బులను పంపిణీ చేసింది. ఏప్రిల్‌, మే నెలలకు సం బంధించిన బియ్యం స్టాక్‌తోపాటు నగదును కూ డా ప్రభుత్వం ముందుగానే పౌర సరఫరాల శాఖ అకౌంట్‌లో జమ చేసింది. కార్డుపై ఉన్న ప్రతిఒక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం అందించిం ది. నగర పేదలే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన నిరుపేదలైన వలస కార్మికులకు సైతం బియ్యం పంపిణీ చేసింది. హైదరాబాద్‌ సీఆర్వో కార్యాలయంతోపాటు మేడ్చల్‌, రంగారెడ్డి డీసీఎస్‌వో పరిధిలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సుమారు 16లక్షలకుపైగా పేదలకు ప్రయోజనం చేకూర్చింది. లాక్‌డౌన్‌లో బువ్వకు ఇబ్బంది కాకూడదనే లక్ష్యంతో ప్రతిఒక్కరికీ వయోభేదం లేకుండా ఉచితంగా బియ్యం పం పిణీ చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో 85 సెంటర్లలో వలస కూలీలకు కూడా అధికారులు 12 కిలోల చొప్పున బియ్యాన్ని అందచేశారు. 

నెల ఖర్చుకు రూ.1500

రాష్ట్రంలోని పేదలకు బియ్యమే కాకుండా నిత్యావసర వస్తువుల కోసం ప్రతి కార్డుపై రూ.1500ను ప్రభుత్వం అందజేసింది. అలాగే వలస కూలీలకు సైతం రూ.500 ఇచ్చి ఆదుకుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరువు ఉన్నప్పటికీ నగరంలో మాత్రం తిండికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆకలితో ఉండకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని విజయవంతంగా కొనసాగిస్తున్నది.


logo