శనివారం 30 మే 2020
Hyderabad - May 17, 2020 , 01:48:38

నగరంలో మరో మూడు రోజులు వర్షాలు

నగరంలో మరో మూడు రోజులు వర్షాలు

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : నిన్నటి వరకు ఠారెత్తించిన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన గ్రేటర్‌ వాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఈ వర్షం స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది. నగరంలోని షేక్‌పేట, అమీర్‌పేట్‌, లక్డీకాపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లి, అబిడ్స్‌, లిబర్టీ, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, బేగంబజార్‌, కర్మాన్‌ఘాట్‌, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, మెహిదీపట్నం, ముషీరాబాద్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట, సికింద్రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, తుర్కయాంజాల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, యాచారం, ఆమన్‌గల్‌, మాడ్గుల, కడ్తాల్‌, చౌదరిగూడ, కొందుర్గు, కొత్తూర్‌, చేవెళ్ల, మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌, యాచారం, మల్కాజిగిరి, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం, ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం, ఎంఎస్‌మక్తా, బల్కంపేట, అబిడ్స్‌, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్‌,  బంజారాహిల్స్‌, సచివాలయం తదితర ప్రాంతాల్లో చెట్లు నేల కూలాయి. హోర్డింగ్‌లు ఊడిపడ్డాయి. షేక్‌పేటలో అత్యధికంగా 5.5 సెం.మీలు వర్షపాతం నమోదైనట్లు విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులు గ్రేటర్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

వేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ పనులు : సీఎండీ రఘుమారెడ్డి

వర్షం కారణంగా 50 విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పాటు ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయినట్లు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గ్రీన్‌లాండ్స్‌, బేగంపేట్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. దాదాపు 100మంది డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు, ఇంజినీర్లు, సిబ్బంది విద్యుత్‌ పునరుద్ధరణ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912లేక 100, కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 7382072104, 7382072106, 7382071574, స్థానిక విద్యుత్‌ శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు.


logo