శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 16, 2020 , 00:04:24

తప్పించుకుపోయిన చిరుత

తప్పించుకుపోయిన చిరుత

నడక దారిని పసిగట్టిన  పోలీస్‌ డాగ్‌ స్పైడర్‌

కొనసాగుతున్న క్యాంప్‌

ఆమనగల్లులో మరో చిరుత అలజడి

రెండు లేగదూడలపై దాడి

సిటీబ్యూరో/బండ్లగూడ : హైదరాబాద్‌ గగన్‌పహాడ్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం కలకలం సృష్టించిన చిరుతపులి అటవీశాఖ బోనుకు చిక్కలేదు. కెమెరా ట్రాప్‌ల కంటపడకుండా ఫామ్‌హౌజ్‌ ప్రాంగణం నుంచి తెలివిగా తప్పించుకున్నది. గగన్‌పహాడ్‌ పెట్రోల్‌ బంకు వెనకాల జాతీయ రహదారిని ఆనుకుని 50 ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఫామ్‌హౌజ్‌లో నక్కిన చిరుతపులి శుక్రవారం తెల్లవారుజామున బయటకు వెళ్లి పోయినట్లు అధికారులు గుర్తించారు. దాని పాదాల గుర్తుల ఆధారంగా అది హిమాయత్‌సాగర్‌ వైపునకు వెళ్లినట్లు నిర్ధారించారు. చిరుత ఏ మార్గంలో వెళ్లిపోయిందనే విషయాన్ని పోలీసు జాగిలం గుర్తించింది. దీంతో ఫారెస్టు అధికారులు, పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పాదాల గుర్తుల ఆధారంగా సైబరాబాద్‌ ట్రాకర్‌ డాగ్‌ స్పైడర్‌ చిరుత వెళ్లిన మార్గాన్ని పసిగట్టింది. బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని 50 ఎకరాల పరిధిలోని కశ్మీరీ కిమామ్‌ ఫామ్‌హౌజ్‌లోకి  గురువారం ఉదయం 9.30గంటల వరకు ఉన్న చిరుత ఆ తర్వాత అక్కడికి సమీపంలోని  90 ఎకరాల ఖాళీ స్థలం ఉన్న విన్‌డిల్‌ కంపెనీ ఆవరణలోకి వెళ్లింది. అందులో ఉన్న ఓ పురాతన బావి దగ్గర ఆగిపోయింది. అక్కడి వరకు చిరుత సంచరించిందని సైబరాబాద్‌ ట్రాకర్‌ డాగ్‌ గుర్తించింది. ట్రాకర్‌ డాగ్‌ ఆధారంగా అధికారులు అక్కడి వరకు రూట్‌ ట్రాక్‌ చేసిన మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే చిరుత ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్కన ఉన్న అటవీ ప్రాంతం నుంచి హిమాయత్‌సాగర్‌ వద్ద కొత్వాల్‌గూడ అటవీ ప్రాంతంలోకి గానీ గ్రేహౌండ్స్‌ గుట్టలలోకి గానీ వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ అటవీ అధికారులు కశ్మీరీ కిమామ్‌ ఫామ్‌హౌజ్‌ ఆవరణలో బోనులను, కెమెరా ట్రాప్‌లను అలాగే ఉంచారు. పోలీస్‌, ఫారెస్ట్‌ క్యాంపు కూడా కొనసాగుతున్నది. చిరుత చివరి అడుగు కనిపించిన విన్‌డేల్‌ కంపెనీ బావి దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆలోచనలో అధికారులు ఉన్నారు. రాజధానిలో అలజడి సృష్టించిన చిరుతను ఆడపులిగా అటవీ అధికారులు నిర్ధారించారు.

ఆమనగల్లులో అలజడి

ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో మళ్లీ చిరుత అలజడి రేగింది. శుక్రవారం తెల్లవారు జామున ఆమనగల్లు మండల కేంద్రానికి చెందిన రైతు ముక్కెర కృష్ణయ్యకు చెందిన రెండు లేగ దూడలపై చిరుత దాడి చేసి చంపి తినేసింది. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా.. చిరుత దాడిలో లేగదూడలు మృత్యువాత పడిన విషయాన్ని గమనించి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందజేశారు. చిరుత దాడిలోనే  దూడలు  మృతిచెందాయని అధికారులు నిర్ధారించారు. ఆమనగల్లు పట్టణ సమీపంలో రాంనుంతల అటవీ  నుంచి చిరుత వచ్చినట్లు భావిస్తున్నారు.


logo