శనివారం 30 మే 2020
Hyderabad - May 16, 2020 , 00:04:37

ఐదున్నర కోట్ల మందికి ‘అన్నపూర్ణ’

ఐదున్నర కోట్ల మందికి ‘అన్నపూర్ణ’

పేదల కడుపు నింపుతున్న ‘అక్షయపాత్ర’

లాక్‌డౌన్‌లో రెండు పూటలా ఉచిత భోజనం 

దివ్యాంగులు, వృద్ధులకు వరంగా మారిన కేంద్రాలు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  పేదలు ఆకలితో అలమటించకుండా నామమాత్రపు ధరతో నాణ్యమైన భోజనం అందిస్తున్న ‘అన్నపూర్ణ’ మరో మైలురాయికి చేరుకున్నది. ఆరేండ్లలో ఐదున్నర కోట్ల మందికి కడుపునిండా భోజనామృతాన్ని అందించి పేదలకు ‘అక్షయపాత్ర’గా మారింది. ఇక లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి  పేదలు, వలస కార్మికులకు పూర్తి ఉచితంగా రెండు పూటలా ఆకలి తీరుస్తున్నది. అంతేకాదు దివ్యాంగులు, వృద్ధుల కోసం మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా ఇంటికే ఆహారం అందించి కడుపునింపుతున్నది.

అలా మొదలై... 

2014లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ మూవ్‌మెంట్‌ వారి అక్షయపాత్ర ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోని సరాయిలో మొట్టమొదటి అన్నపూర్ణ కేంద్రాన్ని ప్రారంభించారు. దశల వారీగా 50 కేంద్రాలను నెలకొల్పి...ఒక్కో కేంద్రం ద్వారా 300 మందికి భోజనాలు పంపిణీ చేశారు. క్రమంగా 150 కేంద్రాలకు విస్తరించారు. ఇలా రోజుకు 40వేల భోజనాలతో ప్రారంభమై ..ఇప్పటివరకు ఐదున్నర కోట్ల మందికిపైగా ఆకలి తీర్చారు. భోజనాల తయారీకి నార్సింగిలో ఒకటి, పటాన్‌చెరు వద్ద మరో అత్యాధునిక వంట గదులను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అన్ని కేంద్రాలకు నిర్దేశించిన సమయానికి వేడి వేడి భోజనం సరఫరా అవుతున్నది.

ఐటీ ఉద్యోగులు సైతం...

భోజనాలు నాణ్యంగా  ఉండడంతో పేదలతో పాటు చిరు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు సైతం అన్నపూర్ణ కేంద్రాలకు వచ్చి ఆకలి తీర్చుకుంటున్నారు. మాదాపూర్‌లోని కేంద్రంలో ఐటీ ఉద్యోగులు, అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్‌ ప్రాంతంలో సెంటర్లకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో రోజుకు 800 నుంచి 1000 భోజనాలు పంపిణీ చేస్తుండడం విశేషం.  రూ.11కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ. 50 కోట్లకు చేరుకుంది. ఒక్కో భోజనానికి రూ.22 ఖర్చు అవుతుండగా,  అందులో అన్నార్తులు రూ. ఐదు ఖర్చు చేస్తుండగా, జీహెచ్‌ఎంసీ రూ. 17 వెచ్చిస్తున్నది.  

ఉచిత భోజనం....

 రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా ఉచితంగా భోజనాలు అందిస్తున్నది. అంతేకాకుండా అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రోజుకు 1.5 నుంచి 1.6 లక్షల మందికి పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం లక్ష మందికి, రాత్రి దాదాపు 60వేల మందికి భోజనాలు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందికి మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు వారి ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక అధికారిని కూడా నియమించారు.

మొబైల్‌ క్యాంటీన్లు....

 ముఖ్యంగా  వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇండ్ల వద్దకే వెళ్లి భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో మార్చి 2న ఉచిత మొబైల్‌ అన్నపూర్ణ కేంద్రాలను కూడా ప్రారంభించారు. రోజూ మధ్యాహ్నం 10వేలు, రాత్రి పది వేల భోజనాలు అందిస్తున్నారు. 

మంత్రి కేటీఆర్‌ హర్షం 

అన్నపూర్ణ కేంద్రాల ద్వారా గడిచిన ఆరేండ్లలో ఐదున్నర కోట్ల మందికి భోజనాలు అందించడంపై మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమం ద్వారా హర్షం వ్యక్తం చేశారు. 


logo