శనివారం 30 మే 2020
Hyderabad - May 15, 2020 , 23:54:28

ఒక్కరోజే రూ.కోటి

ఒక్కరోజే రూ.కోటి

క్రమంగా పుంజుకుంటున్న రిజిస్ట్రేషన్లు..

సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఊపందుకున్న కార్యకలాపాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా, లాక్‌డౌన్‌ల నుంచి తేరుకుని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ క్రమంగా కార్యకలాపాలను ముమ్మరం చేసింది.  దీంతో హైదరాబాద్‌ జిల్లాలో రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకుంటున్నాయి.  జిల్లా పరిధిలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ఇవన్నీ పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నాయి. అయితే  శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్‌ జిల్లాలో రూ. కోటికి పైగా ఆదాయం సమకూరింది. దీంట్లో రూ. 53 లక్షలు ఒక్క బంజారాహిల్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌  కార్యాలయం నుంచే సమకూరడం గమనార్హం.

కరోనా నేపథ్యంలో ..

మాస్కులున్న వారినే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. సిబ్బంది సైతం ఫేస్‌ మాస్కులను ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇక జనం గుమిగూడకుండా ఉండేందుకు గానూ  ఆన్‌లైన్‌లో ప్రీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత, మిగతా తంతును సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పూర్తి చేస్తున్నారు.  అంతేకాకుండా అందరూ శానిటైజేషన్‌ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 

పూర్తిస్థాయిలో సేవలు..  

ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలందిస్తున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌లు, స్టాంపుల విక్రయాలు, ఈసీ సేవలన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

-డీవీ ప్రసాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌,  హైదరాబాద్‌


logo