గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 15, 2020 , 00:24:01

క్యూఆర్‌కోడ్‌తో డబ్బులు కాజేశారు..

క్యూఆర్‌కోడ్‌తో డబ్బులు కాజేశారు..

 సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తిరుమలగిరి ఆర్మీ కార్యాలయంలో పనిచేసే ఓ జవాన్‌కు జమ్మూకశ్మీర్‌ బదిలీ అయ్యింది. అక్కడకు వెళ్లే వరకు ఒక ద్విచక్ర వాహనాన్ని కొనాలని ఓఎల్‌ఎక్స్‌లో యాక్టివా-5జీ ప్రకటనను చూసి అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌చేసి రూ.23 వేలకు వాహనం ధర ఒప్పందం చేసుకున్నాడు. తాము కూడా ఆర్మీ అధికారులమంటూ చెప్పుకున్న సైబర్‌నేరగాళ్లు వాహనం డెలివరీ కోసం ఆర్మీ ట్రాన్స్‌పోర్టుకు డబ్బు చెల్లించాలంటూ మాటలు చెబుతూ,  ఫీజుల కోసం చెల్లించే డబ్బంతా నీకే వాపస్‌ వస్తుందని నమ్మిస్తూ రూ.1.3లక్షలు కాజేశారు. మరో ఘటనలో సికింద్రాబాద్‌లోని మిలిటరీ విభాగంలో పనిచేసే జవాన్‌ తన స్నేహితుడి ఇన్వర్టర్‌ను అమ్మేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. తాము కొంటామని, మేము కూడా ఆర్మీలో పనిచేస్తున్నామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు క్యూఆర్‌కోడ్‌ పంపించి బాధితుడి ఖాతాలో నుంచి రూ.44వేలు కాజేశారు. ఇంకో ఘటనలో గోల్కొండలోని అర్టిలరీ సెంటర్‌లో పనిచేస్తున్న ఓ ఆర్మీ అధికారి తన జియో సిమ్‌కార్డును ఆన్‌లైన్‌లో రీచార్జి చేశాడు. డబ్బు తనఖాతా నుంచి డెబిట్‌ అయినా, సిమ్‌ రీచార్జి కాకపోవడంతో జియో కస్టమర్‌కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో దొరికిన ఓ నంబర్‌కు ఫోన్‌ చేయడంతో తాము జియో ప్రతినిధులమని మాట్లాడిన సైబర్‌నేరగాళ్లు మీ డబ్బు తిరిగి వచ్చేస్తుందని, మేం పంపించే లింక్‌ను ఓపెన్‌ చేసి వివరాలు అందులో పొందుపర్చాలంటూ సూచించి, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత ఆ ఖాతాలో నుంచి రూ. 42 వేలు కాజేశారు. ముగ్గురు బాధితులు వేరు వేరుగా సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. logo