గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 15, 2020 , 00:24:02

వెయ్యి కోట్లతో స్కైవేలు, ఫ్లైఓవర్లు

వెయ్యి కోట్లతో  స్కైవేలు, ఫ్లైఓవర్లు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : రూ.1000 కోట్లతో వరంగల్‌ హైవే వెంట స్కైవేలు, ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సమీప భవిష్యత్‌లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ అత్యంత ప్రధానమైన రైల్వే జంక్షన్‌గా మారుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఈ క్రమంలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అనుసంధానం చేస్తూ లింక్‌, రేడియల్‌ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గురువారం వారు పీర్జాదిగూడ, బోడుప్పల్‌ మేయర్లు జక్కా వెంకటరెడ్డి, సామల బుచ్చిరెడ్డితో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్‌తో పాటు, స్టేషన్‌కు వచ్చే మార్గాలు, కొత్తగా ఏర్పాటు చేయనున్న మార్గాలు, ప్రతిపాదిత రోడ్డు నిర్మాణం కోసం సేకరించనున్న భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్‌ మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించడం, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చే రహదారులన్నింటినీ విస్తరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలిస్తున్నామన్నారు. చర్లపల్లి రైల్వే జంక్షన్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలతో పాటు రైల్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భూసేకరణకు టీడీఆర్‌లను మూడింతలు జారీ చేయనున్నట్లు తెలిపారు. వరంగల్‌ హైవే వెంట ఉన్న ఉప్పల్‌ నల్లచెరువు నుంచి బోడుప్పల్‌ వరకు లింకు రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌ భగాయత్‌ మార్గంలోని మూసీ పక్కనుంచి వెళ్లే రోడ్డుకు ఇరువైపుల భూములు ఉన్న రైతులతో చర్చించాలని అధికారులకు సూచించారు. నాగోలు, బండ్లగూడ, పీర్జాదిగూడలను కలుపుతూ రూ.20 కోట్లతో సుమారు 4 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న లింక్‌రోడ్డు, బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. రూ.3.5కోట్లతో బతుకమ్మ ఘాట్‌, బోడుప్పల్‌ మధ్యలో 1.2 కిలోమీటర్లు నిర్మిస్త్తున్న లింక్‌రోడ్డు, చెంగిచెర్ల - చర్లపల్లి మధ్యలో నిర్మిస్తున్న రోడ్డు పనులు కేవలం 5వందల మీటర్ల భూ సేకరణ సమస్యతో ఆగడంపై ఆరా తీసిన మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భూ సేకరణ ప్రక్రియను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 


logo