ఆదివారం 31 మే 2020
Hyderabad - May 15, 2020 , 00:24:25

ఆపరేషన్‌ ‘చిరుత’

ఆపరేషన్‌ ‘చిరుత’

  • అర్ధరాత్రి వరకూ అన్వేషణ
  • 20 కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ

బండ్లగూడ: హైదరాబాద్‌ కాటేదాన్‌లో నడిరోడ్డుపై స్వేచ్ఛా విహారం చేసి అలజడి సృష్టించిన చిరుతపులిని బంధించడానికి గురువారం అర్ధరాత్రి వరకు అన్వేషణ సాగింది. అధికారులు ఎంతగా ప్రయత్నించినా.. అర్ధరాత్రి వరకు కూడా చిరుత ఆచూకీ లభించలేదు. కాటేదాన్‌ పెట్రోల్‌బంక్‌ వెనకున్న 50 ఎకరాల నిర్జన ప్రాంతంలో దాక్కున్న చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక వైపు 20 కెమెరా ట్రాపులు, మరో వైపు డ్రోన్‌ కెమెరాలు, ఇంకోవైపు బోనులో మేకలను ఎరవేసి పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. శంషాబాద్‌ అటవీ అధికారులు బీమానాయక్‌, సీహెచ్‌.శివయ్య, నెహ్రూ జూపార్క్‌ క్యూరేటర్‌ క్షతిజ, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఐదేండ్ల వయస్సు గల చిరుతపులి చలాకీగా ఉండటంతో పట్టుకోవడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఎలా వచ్చింది ?

అసలు కాటేదాన్‌ ప్రాంతానికి చిరుత ఎలా వచ్చిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్వాల్‌గూడ గుట్టల నుంచి గగన్‌పహడ్‌ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అక్క డి నుంచి రెండు రోజుల క్రితమే కాటేదాన్‌లోని వ్యవసాయ పొలాల్లోకి వచ్చినట్లు సమాచారం. రెండ్రోజులుగా కుక్కలు విపరీతంగా మొరుగుతుండటంతో ఏదో వింత జంతువు వచ్చినట్లు స్థానికులు భావించారు. మొత్తానికి అసలు చిరుత ఎక్కడి నుంచి ఎలా వచ్చిందన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.


logo