గురువారం 28 మే 2020
Hyderabad - May 14, 2020 , 00:40:28

లిఫ్ట్‌ ఇచ్చి.. నిండా ముంచి

లిఫ్ట్‌ ఇచ్చి.. నిండా ముంచి

  • బండికి పోలీస్‌ స్టిక్కర్‌ వేయించుకొని.. మోసం 
  • నిందితుడి అరెస్టు.. వీడిన నాలుగు కేసుల మిస్టరీ 

సిటీబ్యూరో: అచ్చం పోలీసులా తయారై.. వాహనానికి పోలీస్‌ స్టిక్కర్‌ వేయించుకొని.. ప్రయాణికులకు లిఫ్ట్‌ ఇచ్చి..డబ్బులతో ఉడాయిస్తున్న  ఓ పాతనేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ  గతంలో జైలుకు వెళ్లివచ్చాడు. ఇటీవల బచ్చన్నపేట ప్రాంతంలో తిరుగుతూ హైదరాబాద్‌ వచ్చేందుకు ఓ ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్‌ అడిగి బండి ఎక్కాడు. మధ్యలో వాహనదారుడు మూత్ర విసర్జనకు దిగడంతో అతడి దృష్టి మళ్లించి.. బైక్‌తో పరారయ్యాడు. అపహరించిన బైక్‌పై పోలీస్‌ స్టిక్కర్‌ వేయించుకున్నాడు. లౌక్‌డౌన్‌ సమయంలో బస్సులు లేకపోవడంతో వరంగల్‌కు వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకున్నాడు.  ఉదయం 6 గంటల సమయంలో ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకునేవాడు. బోడుప్పల్‌ తదితర ప్రాంతాలు దాటిన తర్వాత ‘లాక్‌డౌన్‌ కదా మా స్నేహితుడు డబ్బులు కావాలన్నాడు. మీ దగ్గర రూ. 10 వేలు ఉంటే ఇవ్వండి. వరంగల్‌కు వెళ్లగానే ఇచ్చేస్తా’నని నమ్మించేవాడు. ప్రయాణికుడు తన వద్ద ఎంత ఉంటే అంత ఇవ్వగానే.. ‘మీరు ఇక్కడే ఉండండి..   ఇచ్చేసి వస్తాను’ అంటూ ఉడాయించేవాడు.  ఇలాంటి కేసులు  నాచారంలో ఒకటి, బచ్చన్నపేటలో ఒకటి, మేడిపల్లిలో రెండు నమోదయ్యాయి. కుషాయిగూడ సీసీఎస్‌ రాములు ఇన్‌స్పెక్టర్‌ బృందం బాలకృష్ణ కదలికలను సీసీ ఫుటేజీలో పరిశీలించి అతడిని అరెస్ట్‌ చేశారు. బాలకృష్ణ గతంలో బైక్‌ చోరీలు, దృష్టి మళ్లించి దోచుకోవడం వంటి నేరాలు చేసి జైలుకు వెళ్లివచ్చాడు. 


logo