బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 14, 2020 , 00:40:29

పెండ్లి పేరుతో సైబర్‌ వల

పెండ్లి పేరుతో సైబర్‌ వల

  • రూ.12.5 లక్షలు బురిడీ 
  • లండన్‌లో ఉద్యోగమంటూ మాయమాటలు
  • విలువైన బహుమతి పేరుతో మహిళకు భారీ మోసం
  • మరో ఘటనలో రూ.7.5లక్షలు 
  • మోసపోయిన వ్యాపారి
  • ఇంకొన్ని ఘటనల్లో రూ.4 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బోరబండకు చెందిన ఓ మహిళ పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను భారత్‌ మ్యాట్రీమోనీ సైట్‌లో పెట్టింది. ఆ ప్రొఫైల్‌ను చూసి పెండ్లి చేసుకుంటానంటూ లండన్‌కు చెందిన యువకుడు ముందుకొచ్చాడు. తన స్వస్థలం కర్ణాటక, వృత్తిరీత్యా లండన్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానంటూ చెప్పుకున్నాడు. వారిద్దరు  కొన్నేండ్లపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కొరియర్‌లో బహుమతి పంపిస్తానంటూ సండీయాడి ఆమెను మురిపించాడు. తాను పంపించబోయే గిఫ్ట్‌లో పౌండ్స్‌, బంగారు ఆభరణాలు, వజ్రాల నెక్లెస్‌, యాపిల్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్లు ఉన్నాయని చెప్పాడు. మరుసటి రోజు కొరియర్‌ సర్వీస్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. మీ చిరునామాకు విలువైన బహుమతులు వస్తున్నాయని, కార్గొ ఫ్లైట్‌ ఇండియాకు చేరుతుందని, అక్కడి నుంచి మీకు అందుతాయని చెప్పారు. అయితే ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందంటూ నెమ్మదిగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. దాని విలువలో 5శాతం ట్యాక్స్‌ ఉంటుందని, జీఎస్టీ, ఆర్‌బీఐ సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ.12.5 లక్షలు డిపాజిట్‌ చేయించారు. కొరియర్‌ పంపించిన వ్యక్తి వద్దనే తీసుకోవాల్సిన మీరు నన్నేందుకు అడుగుతున్నారంటూ ఆమె ప్రశ్నించినా ఇదంతా రిసీవర్‌ చెల్లించాల్సిన ట్యాక్స్‌లని..లండన్‌లో ఇది పంపించే వ్యక్తి చెల్లించాల్సిన ట్యాక్స్‌లు చెల్లించాడంటూ బురిడీ కొట్టించారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో  బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నగరానికి చెందిన ఓ వ్యాపారి ఆన్‌లైన్‌లో మాస్కులు కొనేందుకు ఇంటర్‌నెట్‌లో సర్చ్‌ చేశాడు. ఈ క్రమంలోనే మలేషియా కంపెనీ అంటూ ఓ సంస్థ పేరుతో వ్యాపారికి ఒక కొటేషన్‌ పంపించారు. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌తో మాట్లాడిన వ్యాపారి వారం రోజుల్లో మాస్కులను డెలివరీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లించాలంటూ సూచించడంతో వాళ్లు చెప్పిన ఖాతాలోకి రూ.7.5 లక్షలు డిపాజిట్‌ చేశాడు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ ఉండడంతో మోసమని గుర్తించి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఓ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 లక్షలు కాజేశారు. అది ఎలా జరిగిందో తెలియదంటూ బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. 

మీ కార్డు బ్లాక్‌ అవుతుందంటూ లాలాగూడకు చెందిన ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. క్రెడిట్‌ కార్డు వివరాలు చెబితే ఇప్పుడే అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ ఓటీపీలు చెప్పించుకొని రూ.70 వేలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

ద్విచక్రవాహనం విక్రయ ప్రకటన చూసిన ఓ వ్యక్తి దాన్ని కొనేందుకు విక్రేతతో మాట్లాడారు. తాము ఆర్మీ ఉద్యోగులమని, వాహనాన్ని ఆర్మీ కొరియర్‌లో పంపిస్తామంటూ నమ్మించి రూ.65 వేలు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించారు. ఇదిలాఉండగా ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్‌ షేర్‌ అఫిషియల్‌ పేరుతో తక్కువ ధరకు బ్రాండెడ్‌ వస్తువులను విక్రయిస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రకటనలు చూసి నగరానికి చెందిన ఓ యువకుడు రూ.34 వేలు చెల్లించి మోసపోయాడు. 


logo