గురువారం 28 మే 2020
Hyderabad - May 12, 2020 , 00:00:34

లక్ష వాహనాలు విడుదల

లక్ష వాహనాలు విడుదల

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌లో సీజ్‌ అయిన వాహనాలను మూడు కమిషనరేట్ల పోలీసులు రిలీజ్‌ చేస్తున్నారు. వారం రోజులుగా లక్ష వాహనాలను విడుదల చేశారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభం కాగా..  నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం కోసం ప్రజలకు మూడు కిలోమీటర్ల పరిధిలో తిరిగేందుకు కొన్ని షరతులతో వెసులుబాటు కల్పించారు. దాంతో పాటు అత్యవసర సర్వీస్‌లు, కొన్ని ప్రభుత్వ విభాగాలకు కొంత మేర సడలింపులిచ్చారు. అయితే.. అనుమతి లేకున్నా ప్రతి రోజు వందల సంఖ్యలో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చారు. దీంతో పోలీసులు వారిపై పెట్టీ కేసులు నమోదు చేసి.. వాహనాలను సీజ్‌ చేసి, చలానాలు కూడా విధించారు. ఈ  క్రమంలోనే పోలీస్‌స్టేషన్ల వద్ద సీజ్‌ చేసిన వాహనాలకు పార్కింగ్‌ స్థలం సరిపోకపోవడంతో పలు ఠాణాల అధికారులు ఆయా ఠాణాల పరిధిలో ఉండే ఫంక్షన్‌హాల్స్‌, గ్రౌండ్స్‌ను పార్కింగ్‌ కోసం ఉపయోగించారు. సీజ్‌ అయిన  వాహనాల సంఖ్య రోజు రోజుకు పేరుకుపోతుండడంతో.. యజమాని నుంచి లిఖిత పూర్వంగా బాండ్‌ రాయించుకొని, కోర్టు ఆదేశాలతో జరిమానాలు చెల్లించిన వాహనాలను విడుదల చేశారు. అయితే కొందరు వాహన యజమానులు రాకపోవడంతో ఆ వాహనాలు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. logo