బుధవారం 27 మే 2020
Hyderabad - May 12, 2020 , 00:00:35

జియాగూడలో 25 మందికి

జియాగూడలో 25 మందికి

  • గ్రేటర్‌వ్యాప్తంగా ఒక్కరోజే 79 పాజిటివ్‌ కేసులు
  • సరూర్‌నగర్‌లో ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి

సిటీబ్యూరో: గ్రేటర్‌లో సోమవారం ఒక్కరోజే 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లోనే 64 కేసులు నమోదవ్వగా, కార్వాన్‌ నియోజకవర్గంలోని ఒక జియాగూడలోనే 25 మందికి వైరస్‌ సోకింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో మొత్తం తొమ్మిది మంది కొవిడ్‌ బారినపడ్డారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందికి వైరస్‌ సోకగా, మరో కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ జిల్లా పరిధిలో మొత్తం ఆరు కేసుల్లో  కూకట్‌పల్లిలో 3, కుషాయిగూడలో 1, రామంతాపూర్‌లో 2 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

  • జియాగూడ డివిజన్‌ పరిధిలో 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దుర్గానగర్‌లో కరోనా వచ్చిన వ్యక్తి ఇంట్లోని కుటుంబసభ్యులు ఐదుగురు కొవిడ్‌ బారినపడ్డారు. వెంకటేశ్వరనగర్‌లో పాజిటివ్‌తో మృతి చెందిన మహిళ ఇంట్లో కూతురు,  తోటి కోడలు, అదే ప్రాంతంలో కరోనాతో చనిపోయిన విశ్రాంత ఉద్యోగి ఇంట్లో కూతురు,  కోడలు, బ్యాంక్‌ ఉద్యోగి నివాసంలో అతడి సోదరుడికి వైరస్‌ సోకింది. సబ్జీమండికి చెందిన వ్యక్తి పాజిటివ్‌తో చికిత్స పొందుతుండగా, అతడి కుమారుడు సైతం వ్యాధి బారినపడ్డాడు. ఇందిరానగర్‌లోని ఇటీవల ఓ మహిళకు వైరస్‌ సోకగా, ఆమె ఇంట్లో తన కుమారుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్రీ సాయినగర్‌లోని రిటైర్డ్‌ ఉద్యోగి కరోనాతో మృతి చెందగా, అతడి ఐదుగురు కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకింది. దుర్గానగర్‌కు చెందిన వ్యాపారికి ఇదివరకే వైరస్‌ సోకగా, అతడి ఇంట్లో ఇద్దరు కుమారులు, భార్య, తల్లికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు డివిజన్‌లో మొత్తం 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, ఆరుగురు చనిపోయారు. తొమ్మిది మంది గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. 
  • పాతమలక్‌పేటలోని రేస్‌కోర్సు రోడ్డు వీధిలో ఓ వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతున్నది. తాజాగా, ఆమె భర్త, కోడలుకు సైతం వైరస్‌ సోకింది. అలాగే అక్బర్‌బాగ్‌ పరిధిలోని పల్టన్‌లో నివాసముండే వ్యక్తి కొవిడ్‌ బారినపడగా, అతడి కుమారుడికి కూడా పాజిటివ్‌ వచ్చింది. బాధితులంతా గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
  • తిరుమలనగర్‌ కాలనీలో నివాసముండే మహిళ కరోనా పాజిటివ్‌తో  చనిపోయింది. ఆమె భర్త ఓ దవాఖానలో డయాలిసిస్‌ చేయించుకోగా, అక్కడ ఆయనకు వైరస్‌ సోకింది. అతడి ద్వారా ఆయన భార్యకు వ్యాపించింది. ఆమె పెద్ద కుమారుడు, కోడలుకు కరోనా రావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. వారి బంధువుల నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 
  • నగరంలోని లాలాపేటలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.  దీంతో బాధితురాలు ఉండే భవనంలోని ఎనిమిది మందిని ఎస్‌ఆర్‌ నగర్‌ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రిలోని  క్వారంటైన్‌కు తరలించారు. 
  • వెంగళరావునగర్‌  డివిజన్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతని భార్య, పిల్లలతో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలోని క్వారంటైన్‌కు తరలించారు.
  • సికింద్రాబాద్‌లోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో పని చేసే ఉద్యోగినికి పాజిటివ్‌గా తేలింది. దీంతో సోమవారం సాయంత్రం ఆ కేంద్రాన్ని సీజ్‌ చేసి అందులో పనిచేసే 12 మంది ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. 
  • గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో భౌతిక దూరం, ఆరోగ్య నియమాలు పాటించకుండా క్రయవిక్రయాలు జరుపుతున్న 44 మంది వ్యాపారులపై చైతన్యపురి పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు మార్కెట్‌ చైర్మన్‌, ఎస్‌జీఎస్‌లకు నోటీసులు జారీ చేశారు. 
  • సిటీలో నియంత్రిత ప్రాంత పరిధిని కుదించారు. గతంలో మాదిరిగా చుట్టుపక్కల దాదాపు వంద ఇండ్లకు కాకుండా కరోనా పాజిటివ్‌ నమోదైన భవనానికి మాత్రమే కంటైన్మెంట్‌ను పరిమితం చేశారు. అయితే పరిసర ప్రాంతాల్లో మాత్రం క్రిమి సంహారకాల పిచికారీ, ఆరోగ్య పరీక్షలు, పారిశుధ్య పనులు యథాతథంగా 28 రోజుల పాటు కొనసాగుతాయి. కాగా, ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలోని ఎల్బీనగర్‌లో ఆరు, చార్మినార్‌ జోన్‌లో మూడు కలిపి మొత్తం తొమ్మిది కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. వీటి గడువు కూడా కొన్నిరోజుల్లో ముగియనున్నది. అనంతరం వీటిని కూడా ఎత్తివేయనున్నారు.


logo