ఆదివారం 31 మే 2020
Hyderabad - May 11, 2020 , 23:50:26

పరీక్షించుకొని.. పనుల్లోకి..

పరీక్షించుకొని.. పనుల్లోకి..

 • పరిశ్రమలు తెరిచేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి 
 • ఆదేశాలు జారీచేసిన  పరిశ్రమల శాఖ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులివ్వడంతో పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నది. ఒక్కొక్కటిగా పరిశ్రమలు తెరుచుకుని ఉత్పత్తి వైపు అడుగులేస్తున్నాయి. అయితే పరిశ్రమలను తిరిగి ప్రారంభించేటప్పుడు  చిన్నచిన్న పొరపాట్లు  తప్పవని పరిశ్రమల శాఖ అధికారులు సూచిస్తున్నారు. మొదట వారం పాటు ట్రయల్స్‌, టెస్ట్న్‌ల్రను నిర్వహించాలని, ఆ తర్వాతే ఉత్పత్తిచేసేందుకు ప్రయత్నించాలంటున్నారు. విశాఖపట్నం గ్యాస్‌లీకేజీ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశముండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీచేయగా, వాటిని పాటించాలంటున్నారు. హైదరాబాద్‌లో 415, రంగారెడ్డిలో 1056, మేడ్చల్‌ మల్కాజిగిరిజిల్లాలో మొత్తం 1542 పరిశ్రమలున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వగా అవి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే మరికొన్ని తెరుచుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా పరిశ్రమలను తెరిచేటప్పుడు, ఉత్పత్తి ప్రారంభించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

 • పరిశ్రమలు తెరిచేటప్పుడు మొదటి వారం నుంచే ఉత్పత్తి ప్రారంభించకుండా..  ట్రయల్న్స్‌.్ర. టెస్ట్‌ రన్స్‌ నిర్వహించి, పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలను పరిశీలించుకున్న తర్వాతే ఉత్పత్తిని ప్రారంభించాలి.
 • పరిశ్రమ, యూనిట్‌లో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలి.
 • ఒకే సారి భారీ టార్గెట్లు పెట్టుకుని ఉత్పత్తిచేసేందుకు ప్రయత్నించరాదు.
 • ప్రారంభించినప్పుడు, లేదంటే కొద్ది సమయానికే భారీ శబ్దాలు రావడం, వాసన వచ్చినట్లుగా అనిపించినా, వైబ్రేషన్లు, లీకేజీలు, పొగలు వెలువడినా తక్షణమే పరిశ్రమను మూసివేసి మరమ్మతులు చేపట్టుకోవాలి.
 • రీస్ట్టార్ట్‌ చేసేటప్పుడు యూనిట్‌లోని అన్ని పరికరాలు, యంత్రాలు పర్యవేక్షించాలి.
 • ఏవైనా నివారించలేని ఇబ్బందులు తలెత్తినా.. భద్రతా లోపాలున్నట్లుగా తేలినా, సంబంధిత జిల్లా యంత్రాంగానికి సమాచారమిచ్చి, వారి నుంచి సహాయ సహకారాలు పొందాలి.
 • స్టోరేజీ ఏరియా, గోదాములను తెరిచిన తర్వాత కాస్త గాలి, వెలుతురు ప్రసరించిన తర్వాతే కార్మికులను అనుమతించాలి. 
 • నిల్వచేసిన రసాయనాలకు పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే వినియోగించాలి.
 • పైపులైన్లు, వాల్వ్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేసుకోవాలి.
 • ఫ్రెషర్‌, టెంపరేచర్‌ గేజ్‌లు ఎలా పనిచేస్తున్నాయి చూసుకోవాలి.
 • ప్లాంట్‌ను తెరిచిన తర్వాత టైట్‌నెస్‌ టెస్ట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలి.
 • స్టీమ్‌ పైపింగ్‌ల పనితీరు పర్యవేక్షణకు సర్వీస్‌ టెస్ట్‌ను చేపట్టాలి.
 • లీకేజీలను అరికట్టేందుకు వాక్యూమ్‌ టెస్ట్‌లను నిర్వహించాలి.
 • కొవిడ్‌ 19 దృష్ట్యా 24గంటల పాటు పరిశ్రమలు, యూనిట్లు, ప్లాంట్లలో శానిటైజేషన్‌ వసతులను అందుబాటులో పెట్టాలి.ప్రతి 2-3 గంటలకొక్కసారి శానిటైజేషన్‌ చేసుకునేలా ప్రోత్సహించాలి.  
 • పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి రోజుకు రెండుసార్లు ఉష్ణోగ్రతలను పరీక్షించాలి.
 • కొవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తే విధులకు దూరంగా ఉండాలని సూచించాలి.
 • కార్మికులకు ఫేస్‌ ప్రొటెక్షన్‌ షీల్డ్స్‌, పీపీఈ కిట్లు, మాస్కులు అందజేయాలి.
 • 24 గంటల పాటు కార్యకలాపాలు కొనసాగించే పరిశ్రమల్లో షిప్ట్‌ మారేటప్పుడు గంటవ్యవధినిచ్చి మరో షిప్ట్‌ను ప్రారంభించుకోవాలి.


logo