గురువారం 28 మే 2020
Hyderabad - May 11, 2020 , 01:20:01

నేటి నుంచి మాస్క్‌ యాప్‌ ట్రయల్‌..

నేటి నుంచి మాస్క్‌ యాప్‌ ట్రయల్‌..

సిటీబ్యూరో: కొవిడ్‌-19 సబ్‌టైటిల్‌ మాస్కుతో కొత్త యాప్‌ను పోలీసులు సిద్ధం చేశారు. దీని పనితీరును సోమవారం పరీక్షించనున్నారు. మాస్కులేని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు. దీంతో మాస్కు ధరించని వారిని గుర్తించేందుకు తెలంగాణ పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందుకు వీడియో ఎనాలటిక్స్‌లో సీసీ కెమెరాల ద్వారా మాస్కులేని వారిని గుర్తించి, దగ్గరలో ఉన్న బ్లూకోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సహాయంతో సదరు ఉల్లంఘనదారుడిని గుర్తిస్తారు, మాస్కులేకుండా వెళ్లే వాహనదారుడిని గుర్తించి వాహనం నంబర్‌ ఆధారంగా జరిమానా వేయడం, నడుచుకుంటే వెళ్లే వారిని గుర్తించి నేరుగా అలాంటి వాళ్లకు చలాన్‌ జారీ చేయడం వంటి వివిధ అంశాలతో ఈ కొత్త అప్లికేషన్‌లో సిద్ధం చేశారు. ట్రాఫిక్‌ చాలన్ల మాదిరిగానే మాస్కులేని వారికి జరిమానాలు విధించనున్నారు. ఈ అప్లికేషన్‌ను సోమవారం నుంచి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంతో ట్రయల్‌ నిర్వహించనున్నారు. ఉల్లంఘన దారుడి మొబైల్‌ ఫోన్‌కు ఈ జరిమానాకు సంబంధించిన సమాచారం వెళ్లే విధంగా అప్లికేషన్‌ను సిద్ధం చేశారు. ట్రయల్‌ రన్‌లో ప్రాక్టికల్‌గా కొన్ని కేసులు వేసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో దానికి తుది మెరుగులు దిద్ది, మూడు నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.


logo