గురువారం 28 మే 2020
Hyderabad - May 11, 2020 , 01:20:11

ప్రారంభమైనా..పరిమితంగానే

ప్రారంభమైనా..పరిమితంగానే

  • పట్టాలెక్కేందుకు మెట్రో  సిద్ధం
  • కేంద్రం ఆదేశాలు రాగానే పరుగులు 
  • తక్కువ సంఖ్యలోనే ప్రయాణికుల అనుమతి 
  • కరోనా జాగ్రత్తలతో సర్వీసులు 

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన మెట్రో రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేంద్రం ఆదేశాలు రాగానే సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది హెచ్‌ఎంఆర్‌. అయితే గతంలో మాదిరి రద్దీ ఉండదు. కొన్ని నిబంధనలతో పరిమితంగా ప్రయాణికులను అనుమతిస్తారు. సీట్లపై మార్కింగ్‌, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వాడకం తదితర చర్యలతో సర్వీసులను నడిపించనున్నారు.

 -సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ 

ప్రతిరోజూ పర్యవేక్షణ

లాక్‌డౌన్‌ వల్ల డిపోలకే పరిమితమైన రైళ్లను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ... కండీషన్‌లో ఉంచడంతో పాటు ట్రాక్‌ మెయింటనెన్స్‌ ,సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిరోజూ మానిటరింగ్‌ చేస్తున్నారు. మూడు కారిడార్లలోని ఆరు టర్నినల్స్‌లో ఆరు రైళ్లను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వీటిని నడిపేందుకు సిబ్బంది అందుబాటులో ఉన్నారు.  

ఒక్కో రైలులో 300 మంది... 

ఒకవేళ కేంద్రం ఆదేశాలు ఇస్తే..సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న హెచ్‌ఎంఆర్‌..ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ముందుకెళ్లనున్నది. ప్రతి రైలులో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతించనున్నది.  టికెట్లు తీసుకున్న వారు పరిమిత సంఖ్యలో ప్లాట్‌ఫాం మీదకు రావాల్సి ఉంటుంది. ప్రతి రైలులో 900 నుంచి 1,000 మంది సాధారణ రోజుల్లో  ప్రయాణం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో రైళ్లో 300 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. మాస్కులు లేకుంటే రానివ్వరు. భౌతిక దూరం పాటించేలా సీట్లపై మార్కింగ్‌ చేయనున్నారు. రైలును శానిటైజ్‌ చేయడంతో పాటు ఎక్కేవారూ శానిటైజర్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్కో బోగికి 75 నుంచి 100 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టేవరకు ఇదే మాదిరిగా ఆపరేషన్స్‌ ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రక్షణ కోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డి చెప్పారు.


logo