శనివారం 30 మే 2020
Hyderabad - May 10, 2020 , 00:08:25

లాక్‌డౌన్‌లో స్వచ్ఛమైన గాలి..

లాక్‌డౌన్‌లో స్వచ్ఛమైన గాలి..

  • హాయిగా ఊపిరిపీల్చుకుంటున్న నగరవాసులు l భారీగా తగ్గిన వాయు, శబ్ద కాలుష్యం
  • గాలిలో పెరిగిన నాణ్యత
  • పీసీబీ నివేదిక

దుమ్ము లేదు.. ధూళి లేదు.. కర్ణ భేరి దద్దరిల్లే శబ్దాలు అంతకన్నా లేదు.. నిశ్శబ్దంతో నగరవాసులకు ప్రశాంతత చేరువైంది. రణగొణ ధ్వనుల నుంచి విముక్తి లభించింది. అవును లాక్‌డౌన్‌తో వాహనాలు రోడ్డెక్కకపోవడం, ట్రాఫిక్‌ రద్దీ లేకపోవడంతో నగరంలో వాయు, శబ్ద కాలుష్యం భారీగా తగ్గింది. గాలిలోనూ నాణ్యత పెరిగి.. స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడింది. 

- సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ   

పీసీబీ నివేదిక... 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాలుష్య స్థితిగతులపై ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో పీసీబీ అధికారులు గ్రేటర్‌ వ్యాప్తంగా కాలుష్య తీరుతెన్నులతో కూడిన నివేదికను సమర్పించారు.దాని ప్రకారం.. హైదరాబాద్‌ నగరంలో వాయువుల నాణ్యత కాస్త మెరుగుపడింది. పర్టిక్యూలెటెడ్‌ మ్యాటర్‌ -10 (పీఎం 10) 30శాతం, పీఎం 2.5 12 శాతం మేర తగ్గాయి. నైట్రోజన్‌ ఆక్సైడ్స్‌ 25 శాతం, అమ్మోనియా 13 శాతం తగ్గాయి. శబ్దకాలుష్యం 10 శాతం తగ్గింది.

10 శాతం రోడ్డెక్కుతున్నాయి..

నగరంలో వెలువడుతున్న వాయు కాలుష్యంలో ప్రధాన భాగం వాహనాలదే. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. 49 శాతానికి పైగా కాలుష్యం ఒక వాహనాల నుంచే వెలువడుతున్నది. మొత్తం వాహనాల్లో 50 శాతం ద్విచక్ర వాహనాలే ఉండగా 1.20 లక్షల ఆటోరిక్షాలు, 3850 ఆర్టీసీ  బస్సులు, సరుకు రవాణా చేస్తున్న లారీలు, ట్రక్కులు రోడ్లపైకి వచ్చి కాలుష్యాన్ని తోడ్కోనివస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. ప్రయాణాలపై ఆంక్షలున్నా.. 10 శాతం వాహనాలు రోడ్డెక్కుతున్నాయని పీసీబీ నివేదిక వెల్లడించింది. గ్రేటర్‌లో మొత్తం 50లక్షల వాహనాలు నిత్యం రాకపోకలు సాగించేవి. అయితే కొన్ని సడలింపులివ్వడంతో 15 శాతం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీని ఫలితంగా కాలుష్య తీవ్రతల్లో తేడాలు కనిపిస్తున్నాయి. 

ఆ ప్రాంతాల్లో... 

చిక్కడపల్లి, లంగర్‌హౌజ్‌, బాలానగర్‌, ట్యాంక్‌బండ్‌, అబిడ్స్‌, జీడిమెట్ల, మాదాపూర్‌, సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నగరంలో అతి ముఖ్యమైన ప్రాంతాలు. సింహాభాగం వ్యాపారం, వాణిజ్యం ఈ ప్రాంతాల్లోనే కొనసాగుతుంది. ఇక పరిశ్రమలు సైతం వీటి పరిధిల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఫలితంగా ఈ ప్రాంతాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఒక్కో ప్రాంతంలో 58 శాతం నుంచి 35 శాతం వరకు పడిపోయింది.


logo