బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 10, 2020 , 01:12:57

ఉక్కు సంకల్పంతో

ఉక్కు సంకల్పంతో

  • మారనున్న పంజాగుట్ట శ్మశానవాటిక కూడలి రూపురేఖలు   
  • మూడు స్టీల్‌ బ్రిడ్జిల నిర్మాణం.. ట్రాఫిక్‌ కష్టాలకు చరమగీతం 

సిటీబ్యూరో: పంజాగుట్టకు కొత్త కళ రానున్నది. ఇక్కడి శ్మశానవాటిక కూడలి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నది. అత్యంత ఇరుకుగా ఉన్న ఈ ప్రాంతంలో మూడు ఉక్కు వంతెనల నిర్మాణంతో ట్రాఫిక్‌ కష్టాలకు పూర్తిగా చెక్‌ పడనున్నది. వాహనదారులకు ఎంతో ఉపశమనం లభించనున్నది. 

ఎక్కడెక్కడంటే... 

పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో మూడు స్టీల్‌ బ్రిడ్జిలను నిర్మించాలని  జీహెచ్‌ఎంసీ సంకల్పించింది. ఇందులో ఒక వంతెన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నది.  

ఉక్కు వంతెనల నిర్మాణం ఇలా.. 

  • స్టీల్‌ బ్రిడ్జి-1 -ఎల్వీ ప్రసాద్‌ వైద్యశాల వైపు నుంచి పంజాగుట్ట సర్కిల్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ కోసం రెండు లేన్ల బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇది తుది దశకు చేరుకుంది. నెలాఖరుకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వ్యయం రూ. ఐదు కోట్లు. 
  • స్టీల్‌ బ్రిడ్జి-2 - నాగార్జున సర్కిల్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ ఒకటి నుంచి ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైపు వెళ్లే ట్రాఫిక్‌ సౌకర్యార్థం చట్నీస్‌ ముందు శ్మశానవాటిక గేటును మూసివేసి అక్కడి నుంచి హెచ్‌టీ టవర్‌ వరకు రోడ్డును విస్తరించి సింగిల్‌ లేన్‌ వంతెన నిర్మిస్తున్నారు. ప్రస్తుత రోడ్డును యథావిధిగా ఉపయోగిస్తూనే.. స్టీల్‌ బ్రిడ్జి పైనుంచి కూడా ట్రాఫిక్‌ వెళ్లేందుకు ఆస్కారం కలుగుతుంది. దీని పొడవు దాదాపు 90మీటర్లు కాగా, వెడల్పు ఐదు మీటర్లు. 
  • స్టీల్‌ బ్రిడ్జ్జి -3-  నాగార్జున సర్కిల్‌ వైపు నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక లోనికి రెండు లేన్ల స్టీల్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పొడవు 120 మీటర్లు కాగా, వెడల్పు ఏడు మీటర్లు. ఇది పూర్తగా శ్మశానవాటిక లోనికి వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.ఇందుకోసం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ ఒకటి వైపు ప్రస్తుత షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద కొత్తగా ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, శ్మశానవాటిక నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ ఒకటి వైపు బయటకు వెళ్లేందుకు దేవరకొండ బస్తీ రోడ్డును ప్రస్తుత రెండున్నర మీటర్ల నుంచి ఆరు మీటర్లకు విస్తరిస్తున్నారు. 


logo