ఆదివారం 31 మే 2020
Hyderabad - May 08, 2020 , 23:36:32

నెమ్మదిస్తున్న కరోనా..

నెమ్మదిస్తున్న కరోనా..

  • నాలుగు జోన్లలో పూర్తిగా కంటైన్మెంట్ల  ఎత్తివేత
  • తొమ్మిదికి పరిమితమైన నియంత్రిత ప్రాంతాలు  

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ పరిధిలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్నది. గతంలో దాదాపు 170పైచిలుకు ఉన్న కంటైన్మెంట్‌ జోన్లు తాజాగా తొమ్మిదికి పడిపోయింది. గడువు పూర్తయిన నియంత్రిత ప్రాంతాలను క్రమంగా ఎత్తివేస్తున్నారు. ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌లో పూర్తిగా కంటైన్మెంట్లను ఎత్తివేయడం విశేషం. ఈ నాలుగు జోన్లు ఇప్పుడు కరోనా ఫ్రీగా మారాయి. అయితే ఆయా ప్రాంతాల్లో క్రిమి సంహారక ద్రావణాల పిచికారీ మాత్రం కొనసాగిస్తున్నారు. కాగా, కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో మాత్రం కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.  ప్రస్తుతం ఎల్బీనగర్‌ జోన్‌ నుంచి 52పాజిటివ్‌ కేసులు ఉండగా,  ఆరు, చార్మినార్‌ జోన్‌లో 260 జోన్లు ఉండగా, మూడు కంటైన్మెంట్‌ ప్రాంతాలు ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్‌ పరిధిలో 312 పాజిటివ్‌ కేసులకు గాను తొమ్మిది మాత్రమే కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. 

రోజుకు రెండుసార్లు పిచికారీ...

కంటైన్మెంట్‌ జోన్లు ఎత్తివేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు క్రిమి సంహారక రసాయనాల పిచికారీ యథావిథిగా కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.  పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు కంటైన్మెంట్‌ ఉన్నప్పుడు నిర్వహించిన విధంగానే పారిశుధ్య పనులతోపాటు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని రోజుకు రెండుసార్లు పిచికారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కంటైన్మెంట్‌ ప్రాంతాలు ఇవే...

  • ఎల్బీనగర్‌ జోన్‌- కాప్రా వీఎన్‌ రెడ్డికాలనీ, రామంతాపూర్‌ చర్చికాలనీ, బీఎన్‌ రెడ్డి నగర్‌ ఎస్‌కేడీ నగర్‌, శారదానగర్‌, తిరుమలనగర్‌, జేబీ నగర్‌, చార్మినార్‌ జోన్‌- అక్బర్‌బాగ్‌లోని లక్ష్మీపూజ రెసిడెన్సీ, ప్రొఫెసర్‌ కాలనీ, మలక్‌పేట్‌ మహబూబ్‌ మాన్షన్‌, డబీర్‌పుర మాతా కీ ఖిడ్కీజ. 
  • రాంకోఠిలో కరోనా పాజిటివ్‌తో వృద్ధుడు మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు పది మందిని కరోనా అనుమానితులుగా గుర్తించి ఐసొలేషన్‌కు తరలించామని  వైద్యాధికారి డాక్టర్‌ దీప్తి ప్రియాంక తెలిపారు. 
  • ఎస్‌ఆర్‌నగర్‌ గురుమూర్తినగర్‌లో కొబ్బరి బోండాలు అమ్ముకునే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మంత్రి తలసాని ఆదేశాల మేరకు గురుమూర్తినగర్‌ పరిసరాల్లో వైరస్‌ వ్యాపించకుండా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు.
  • జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గు ముఖం పడుతున్నాయి. 12 మంది బాధితులు గాంధీ దవాఖానలో కోలుకొని తమ ఇండ్లకు వెళ్లినట్లు బాలాపూర్‌ ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు  గోవింద్‌రెడ్డి తెలిపారు. 
  • కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌ గాంధీనగర్‌లో నివాసముండే ఓ వ్యక్తికి వైరస్‌ సోకింది. అతన్ని ఐసొలేషన్‌కు,  కుటుంబ సభ్యులు 11 మందిని పరీక్షల కోసం వైద్యశాలకు తరలించారు.
  • జియాగూడ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. అయితే వృద్ధుడికి రక్త పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతడి కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. 
  • ఇందిరానగర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 

 గ్రేటర్‌లో మరో 10 పాజిటివ్‌ కేసులు 

గ్రేటర్‌లో శుక్రవారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న మొన్నటితో పోల్చితే తాజాగా కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం  పట్టింది. నగరంలో 21మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

జాగ్రత్తలతోనే కట్టడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాగ్రత్తలతోనే కరోనాను కట్టడి చేయవచ్చని, దీనికోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని గాంధీ దవాఖాన జనరల్‌ మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.మాధవ్‌ అన్నారు. శుక్రవారం సమాచార భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా సోకిన ప్రతి వందమందిలో తొంబై శాతం మందికి ఏ ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. జ్వరం, పొడిదగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి దవాఖానలకు వెళితే వైద్యులు తగిన వైద్య సహాయం అందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలన్నారు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసిన అనంతరమే వాడాలన్నారు. శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని, రోగ నిరోధక శక్తి పెంచే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.


logo