ఆదివారం 31 మే 2020
Hyderabad - May 08, 2020 , 23:36:39

సీటుకు ఒక్కరే..

సీటుకు ఒక్కరే..

  • 29 డిపోల్లో 3500 బస్సులు సిద్ధం
  • గ్రేటర్‌ ఆపరేషన్స్‌కు నాన్‌ ఏసీ బస్సులు
  • మే 15 తర్వాత ప్రకటన వచ్చే అవకాశం
  • నేడు ఎయిర్‌పోర్టుకు 20 బస్సులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ఆపరేషన్స్‌ కోసం గ్రేటర్‌ ఆర్టీసీ సిద్ధమైంది. ఆదేశాలు అందిన వెంటనే బస్సులు రోడ్డెక్కించేందుకు సమాయత్తమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజా రవాణా స్తంభించింది. కరోనా ప్రబలుతుందనే ఆలోచనతో ప్రభుత్వం కట్టడి చేసింది. మెట్రో, ఎంఎంటీఎస్‌, రైల్వే, క్యాబ్‌లు, ఆటోరిక్షాలకు రోడ్డెక్కకుండా ఆదేశాలు జారీచేశారు. అందులోభాగంగా అత్యవసర సేవలకు పోను డిపోలకు పరిమితమైన నాన్‌ ఏసీ బస్సులను రోడ్డుపైకి తేనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయం మే 15న వెలుపడనున్నదని ఆర్టీసీకీ చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. గ్రీన్‌జోన్లలో తిప్పే అవకాశమున్నప్పటికీ నగరంలో కోవిడ్‌ కేసులు ఉన్నందున బస్సులు బయటకు తీస్తే కరోనా విస్తరిస్తుందనే ఉద్దేశంతో తీయడం లేదు. కరోనా తగ్గుముఖం పట్టి నమోదవుతున్న కేసులు తగ్గితే గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో బస్సులు తిప్పే అవకాశముంది. తెలంగాణలో కేసులు తగ్గుతున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి ఆపరేషన్స్‌ నిర్వహించడానికి  టీఎస్‌ఆర్టీసీ సమాయత్తమవుతున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని 29 డిపోలకు సంబంధించి 3500 బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే నగరంలో అత్యవసర సేవల కోసం ఆర్టీసీ దాదాపు ప్రతిరోజు 55 బస్సులు నడిపిస్తున్నది. వలస కార్మికులను రైల్వే స్టేషన్లకు తరలించడంలో కూడా పెద్ద ఎత్తున సేవలందించింది.

సీటుకు ఒక్కరే కూర్చునేలా.. 

ప్రభుత్వం ఆదేశాలు అందగానే కేవలం నాన్‌ ఏసీ బస్సులను మాత్రమే రోడ్డెక్కించి ఏసీ బస్సులను డిపోలకు పరిమితం చేయనున్నారు. అయితే  సీటుకు ఒక్కరిని మాత్ర మే కూర్చునేలా అనుమతి ఇవ్వనున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. శానిటైజర్లు అందుబాటులో పెట్టడంతో పాటు బస్సును శానిటైజ్‌ చేసి పంపిస్తారు. బస్సులో స్టాండింగ్‌కు అవకాశమివ్వకుండా నిర్దేశించిన మేరకే ప్రయాణికులను అనుమతిస్తారు. దీనికోసం ప్రత్యేక సూచనలు అందిస్తారు. డ్రైవర్లు, కండక్టర్లు లేదా బస్సు  ఎక్కే పాయింట్ల వద్ద టికెట్లు ఇస్తారు. 

నేడు ఎయిర్‌పోర్టుకు 20 బస్సులు

 వివిధ దేశాల నుంచి విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల్లో వస్తున్న వారి కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ఎయిర్‌పోర్టులో 20 బస్సులను ఏర్పాటు చేసింది. వీటితోపాటు వారితోపాటు తీసుకువచ్చే లగేజీ కోసం కార్గో సర్వీసులను పంపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో దిగినవారికి శానిటైజేషన్‌ చేసిన బస్సులను అం దుబాటులో పెడుతున్నారు.

ఆర్టీవో కార్యాలయాల్లో పెరిగిన లావాదేవీలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో రవాణా సేవలకు సంబంధించి మొదటిరోజుతో పోల్చితే రెండోరోజు పెరిగాయి. వాహన రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నప్పటికీ కేవలం డ్రైవింగ్‌ టెస్ట్‌లు, లెర్నింగ్‌ లైసెన్సులు తదితర సేవల కోసం మాత్రమే వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయం పరిధిలో శుక్రవారం దాదాపు 450 వరకు లావాదేవీలు జరుగగా జంటనగరాల పరిధిలో 180 వరకు లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు.


logo