గురువారం 28 మే 2020
Hyderabad - May 08, 2020 , 23:36:40

సైబర్‌ వలలో చిక్కారు...

సైబర్‌ వలలో చిక్కారు...

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో చిక్కి నగరానికి చెందిన పలువురు మోసపోయారు. సీబీఐలో పనిచేసిన ఓ రిటైర్డు ఉద్యోగి బ్లాక్‌చైన్‌.కామ్‌లో ఖాతా తెరిచాడు. ఆ ఖాతాలో 5,414 డాలర్లు డిపాజిట్‌ చేసి దాన్ని బిట్‌కాయిన్‌లలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ ఖాతాలో నుంచి 5,311 డాలర్లను శుక్రవారం సైబర్‌నేరగాళ్లు కాజేశారు. మరో ఘటనలో నగరానికి చెందిన నాగేందర్‌కు కొత్తగా యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌కార్డు వచ్చింది. మరుసటి రోజు సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసి తాము యాక్సెస్‌ బ్యాం కు నుంచి మాట్లాడుతున్నామంటూ కార్డు వివరాలతో పాటు సీవీవీ, ఓటీపీ నంబర్లు తీసుకొని అందులో నుంచి రూ.84వేలు కాజేశారు. మరో ఘటనలో వెంకటేశ్వర్‌రావు ఓఎల్‌ఎక్స్‌లో డిజిటల్‌ కెమెరా ప్రకటన చూసి కొనేందుకు అందు లో ఉన్న ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేశాడు. ఫోన్‌లో మాట్లాడిన సైబర్‌నేరగాళ్లు క్యూఆర్‌కోడ్‌ పంపి, అతడి వద్ద నుంచి రూ.38 వేలు కాజేశారు. దీంతో బాధితులంతా సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పేర్కొన్నారు. 

ఇద్దరు అరెస్టు

నాగారంలోని అన్నమ్యకాలనీలో ఉండే అల్లాడి భరత్‌గౌడ్‌, కుషాయిగూడలో నివాసముండే దేవబత్తిని వెంకటేశ్వరరావు స్నేహితులు. లాక్‌డౌన్‌ సమయంలో కారు నంబర్‌ ప్లేట్‌పై (ఏపీ 07బీఎం 5555)వేసి, దానికి పోలీస్‌ స్టిక్కర్‌ అతికించారు. టోల్‌గేట్ల వద్ద పోలీసులమంటూ తిరిగారు. మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అనుమానంతో ఇంజిన్‌ చాసెస్‌ నంబర్‌ను తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. వాహనంలో రెండు మద్యం బాటిళ్లు కూడా లభించాయి. నిందితులిద్దరిని విచారించగా, వైజాగ్‌కు చెందిన బాలాజీ వాహనం(ఏపీ 31 ఈఎఫ్‌ 0887)ను మూడు నెలల క్రితం తీసుకున్నారు. నంబర్‌ మార్పు చేసి తిరుగుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరి అరెస్ట్‌ చేసి తదుపరి విచారణకు కీసర పోలీసులకు అప్పగించారు. 


logo