శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 00:36:28

40 రోజుల్లోనే.. 1000 కోట్ల పనులు

40 రోజుల్లోనే.. 1000 కోట్ల పనులు

  • నాలుగు నెలల పనులన్నీ లాక్‌డౌన్‌లోనే..
  • తుది దశకు పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, బయోడైవర్సిటీ లెవల్‌ -1 వంతెన 
  • నెలాఖరుకు ప్రారంభానికి సన్నాహాలు
  • బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పిల్లర్ల నిర్మాణం పూర్తి
  • పనుల్లో అడ్డంకులు తొలగించేందుకు మంత్రి కేటీఆర్‌ 7 సార్లు సమీక్ష

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌ సమయాన్ని జీహెచ్‌ఎంసీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నది. మొత్తం రూ.1750 కోట్లకు గాను 40 రోజుల్లో రూ.1000 కోట్ల పనులు పూర్తిచేసింది. స్టీల్‌ బ్రిడ్జి సహా రెండు ఫ్లైఓవర్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. వీటిని ఈ నెలాఖరుకు ప్రారంభించాలని నిర్ణయించింది. దాదాపు ఏడాది సమయం పట్టే స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం మూడు నెలల్లో పూర్తికానున్నది. ఈ నెలాఖరుకల్లా మరో రూ.750కోట్ల పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్‌ఆర్‌డీపీ కింద రూ. 1250 కోట్లు, సీఆర్‌ఎంపీ కింద రూ. 250 కోట్లు, లింకు/స్లిప్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నారు. మే 6 నాటికి రూ. 1000 కోట్ల పనులు పూర్తయ్యాయి.  సాధారణ రోజుల్లో ఈ పనుల నిర్వహణకు 4-6  నెలల సమయం పట్టనుండగా, లాక్‌డౌన్‌ వల్ల ట్రాఫిక్‌ సమస్య లేకపోవడంతో కేవలం 40రోజుల్లో పూర్తిచేయడం విశేషం. సీఆర్‌ఎంపీ కింద ఆరు జోన్లలో 709 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. జూన్‌ చివరికల్లా 331 కిలోమీటర్ల వరకు రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మే 6 నాటికి 208 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి.

రెండు వంతెనలు తుదిదశకు..

గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే మూడు లేన్ల బయోడైవర్సిటీ లెవల్‌ -1 వంతెన ఈ నెలాఖరులోగా పూర్తికానున్నది.  పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి పనులు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

బాలానగర్‌ వంతెన పిల్లర్లు పూర్తి

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ఫౌండేషన్‌, పిల్లర్ల నిర్మాణం పూర్తయింది.  7 పిల్లర్ల  పనులు జాప్యం కాగా ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో  భూ సేకరణ, ఆస్తుల స్వాధీనం, పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టారు.  సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.

మంత్రి కేటీఆర్‌ కృషితో...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఏడుసార్లు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు.  బీటీ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడగా, ఇతర రాష్ర్టాల అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి ఆ అడ్డంకులను తొలగించేందుకు కృషిచేశారు. మంత్రి  ఆదేశాల ప్రకారం మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ పనుల వేగం తగ్గకుండా చూస్తున్నారు. 

  బాలానగర్‌ వంతెన వివరాలు.. 

  • ప్రాజెక్టులో మొత్తం 26 పిల్లర్లు పూర్తి చేశారు
  • పీఎస్‌పీ గడ్డర్స్‌ ఏర్పాటులో 176కు గానూ 82 వరకు పూర్తి
  • స్టీల్‌ గడ్డర్స్‌లో 30 పనులకు గానూ అన్నీ పూర్తి చేశారు
  • ఇంటర్మీడియట్‌ డయాఫ్రం పదిహేనుకు 15 పూర్తి  
  • ప్రస్తుతం స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. 
logo