గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 08, 2020 , 00:33:40

ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆకు పచ్చని చీర

ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆకు పచ్చని చీర

  • పురుడు బోసుకున్న ‘స్మైల్‌ ఏ గిఫ్ట్‌'
  • రూపురేఖలు మారనున్న కీసర రిజర్వు ఫారెస్ట్‌
  • కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్‌
  • తొలుత రూ.2.53కోట్లతో అభివృద్ధి పనులు 
  • త్వరలోనే  పెద్దమ్మ చెరువు ట్యాంక్‌బండ్‌ పనులు
  • పర్యాటక కేంద్రంగా మారనున్న పరిసర ప్రాంతాలు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆధ్మాత్మిక సిరిగా కీర్తి గడిస్తున్న కేసరిగిరి శైవక్షేత్రం రూపురేఖలు మారనున్నాయి. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ దత్తత తీసుకోవడంతో కీసర రిజర్వు ఫారెస్ట్‌ ఆకుపచ్చని అందాలకు నెలవుగా మారుతున్నది. ‘తెలంగాణ సమాజం నాకు ఎంతో ఇచ్చింది.. తిరిగి ఈ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి’ అనే సంకల్పంతో గత ఏడాది కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘స్మైల్‌ ఏ గిఫ్ట్‌' స్ఫూర్తితో మేడ్చల్‌ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను ఎంపీ సంతోష్‌ కుమార్‌ దత్తత తీసుకుని కీసర శ్రీరామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి కీసర రిజర్వు ఫారెస్ట్‌లో ఒక్కరోజే నాటిన 10వేల మొక్కలు పెరుగుతుండటంతో ఒకప్పుడు ఎడారిని తలపించిన కీసర పరిసరాలు ఇప్పుడు ఆకుపచ్చని లోగిళ్లుగా మారుతున్నాయి. అంతేకాదు కీసర రిజర్వు ఫారెస్ట్‌తో పాటు త్వరలోనే పరిసర ప్రాంతాలన్ని పర్యాటక కేంద్రాలుగా మారబోతున్నాయి. 

6 కోట్లతో ప్రతిపాదనలు..

తొలుత రూ.3కోట్లతో అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ, కీసర రిజర్వు ఫారెస్ట్‌ను ఆహ్లాదానికి చిరునామాగా మార్చాలనే ఉద్దేశంతో ఎంపీ సూచనల మేరకు రూ.6 కోట్లతో  ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నిధులు మినహాయిస్తే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంపీ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. ఈ క్రమంలోనే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు రూ.2,53,46,960 నిధులతో కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి దర్శనానికి వచ్చే సందర్శకుల మనసును గెలిచేలా ముందుగా 10 రకాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు జిల్లా ఫారెస్ట్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా గజబో, యోగాషెడ్‌ నిర్మాణం, వాటర్‌ కాస్కేడ్‌, మినీ ట్యాంక్‌బండ్‌, థీమ్‌పార్కు నిర్మాణం, 15 ఫీట్ల ఎత్తైన మొక్కల పెంపకం, సైక్లింగ్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌ను, ప్రకృతి రమణీయత ఉట్టి పడేలా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ అభివృద్ధి పనులకు వెచ్చించనున్న ఎంపీ నిధులను విడుదల చేయాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌కు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే లేఖ రాశారని, చెరువుకట్టపై ఉపాధి హామీ కూలీలతో కంపచెట్లను తొలగించే పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.   

ఆహ్లాదంగా మారనున్న పల్లెలు

రోజు రోజుకూ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగర శివారులోని పల్లెలు కూడా పట్టణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర, సెమీ అర్బన్‌ గ్రామాల్లోని ప్రజలు సేద తీరేందుకు, వారికి ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నగర శివారులోని రిజర్వు ఫారెస్ట్‌లను ‘అర్బన్‌ లంగ్స్‌ పార్కు’లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా పరిధిలోని నారపల్లి, మేడిపల్లి, దూలపల్లి, చెంగిచెర్ల, నాగారం, కండ్లకోయ రిజర్వు ఫారెస్ట్‌లలో ఏర్పాటు చేసిన అర్బన్‌ లంగ్స్‌ పార్కులకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. కీసర రిజర్వు ఫారెస్ట్‌ ఎంపీ సంతోష్‌ చొరవతో అభివృద్ధికి బీజాలు పడుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయని, కీసర గుట్ట ఎకో టూరిజంకు అడ్రస్‌గా, అడ్వెంచర్‌ ఆటలకు నిలయంగా, ఆధ్యాత్మికతకు చిరునామాగా మారుతున్నదని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.  logo