మంగళవారం 26 మే 2020
Hyderabad - May 07, 2020 , 00:24:26

ఖుషీ ఖుషీగా మందుబాబులు

ఖుషీ ఖుషీగా మందుబాబులు

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : 44రోజుల తరువాత  జీహెచ్‌ఎంసీ పరిధిలో, మేడ్చల్‌ జిల్లాలో వైన్‌ షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇరుగు పొరుగు రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పూర్తి క్రమశిక్షణ కనిపించింది. బుధవారం హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో సుమారు రూ.8కోట్ల నుంచి 10 కోట్లు, రంగారెడ్డి, మేడ్చల్‌ పరిధిలో సుమారు రూ.20కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ వర్గాలు అంచనావేశాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా మొత్తం 429మద్యం దుకాణాలు ఉండగా హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లా పరిధిలో 173 మద్యం దుకాణాలు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో 256 మద్యం దుకాణాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌లోని తొలిరోజు జీహెచ్‌ఎంసీ పరిధిలో, మేడ్చల్‌ జిల్లాలో కలిపి 400లకు పైగా దుకాణాలు తెరుచుకున్నట్లు తెలిపారు. 

సరిపడా మద్యం ఉంది

మద్యం దుకాణాల్లో ఫుల్‌ స్టాక్‌ ఉంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సాధారణంగా ప్రతి షాపులో వారం రోజులకు సరిపోయే స్టాక్‌ ఉంటుంది. ప్రస్తుతం ప్రతి దుకాణంలో మరో మూడు నాలుగు రోజులకు సరిపడా స్టాక్‌ ఉంది. మద్యం డిపోల్లో కూడా నిలువలు ఉన్నాయి. నేటి నుంచి షాపులకు మద్యం సరఫరా చేస్తాం. దీంతో మద్యం కొరత ఏర్పడే సమస్యే ఉండదు.

-ఈఎస్‌లు శ్రీనివాస్‌, ప్రదీప్‌రావు


logo