శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:43:25

నగరంలో మరిన్ని కేసులు..ఇలా

నగరంలో మరిన్ని కేసులు..ఇలా

జియాగూడ: జియాగూడ డివిజన్‌ పరిధిలోని సాయిదుర్గానగర్‌లో ఇటీవల కరోనా పాజిటివ్‌ సోకిన జీహెచ్‌ఎంసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి (23) తండ్రికి (52) వైద్య పరీక్షలు నిర్వహించగా మంగళవారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటి వరకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఇంట్లో మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సబ్జీమండి ప్రాంతంలోని కూరగాయల వ్యాపారి, మరో వ్యక్తి (48) గాంధీ దవాఖానకు అనారోగ్యంతో చికిత్స నిమిత్తం వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.  మంగళవారం కూరగాయల వ్యాపారి (48) మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.     

 కూరగాయల మార్కెట్‌ మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు జియాగూడ కూరగాయల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ తెలిపారు. 

పాతబస్తీలో మరో పాజిటివ్‌ కేసు

 చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీనగర్‌ బస్తీలో ఓ కుటుంబంలోని వ్యక్తి (45) మలక్‌పేట్‌ గంజ్‌లో పని చేస్తున్నాడు. పది రోజులకు  పైగా ఇతనికి దగ్గుతో స్థానికులు అధికారులకు సమాచారమివ్వడంతో ఈ నెల 4వ తేదీన ఆ వ్యక్తిని  గాంధీ  దవాఖానలో చేర్పించారు. పరీక్షల అనంతరం పాజిటివ్‌ తేలింది. దీంతో ఆ వ్యక్తి భార్యతో పాటు  ఇద్దరు పిల్లలను,  చుట్టుపక్కల మరో నాలుగైదు కుటుంబాలను క్వారంటైన్‌లో ఉంచారు

హుడాసాయి నగర్‌లో 

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధి హుడాసాయి నగర్‌ కాలనీలో కరోనా కేసు బయటపడింది. కాలనీకి చెందిన ఓ వ్యక్తి తల్లి వనస్థలిపురంలోని కూతురు ఇంటికి వెళ్లిన నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ రాగా ఆమె కొడుకుకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. కాలనీలోని రోడ్డు నంబర్‌-6ను కంటైన్మెంట్‌గా ప్రకటించారు. కాలనీలోని ప్రతి ఇంటి వద్ద ఫైరింజన్‌తో సోడియం హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి సిబ్బందితో కలిసి చల్లారు. 


logo