గురువారం 28 మే 2020
Hyderabad - May 05, 2020 , 00:12:10

నకిలీ లింక్‌లతో దోచేస్తారు..!

నకిలీ లింక్‌లతో దోచేస్తారు..!

  • లాక్‌డౌన్‌లో సైబర్‌ నేరగాళ్ల సరికొత్త మోసం
  • స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల నుంచి డేటా చోరీ
  • సమాచారంతో బ్యాంకు ఖాతాలు ఖాళీ..
  • అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ నిపుణులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వేళ... సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసానికి పాల్పడుతున్నారు. నకిలీ లింక్‌లు పంపించి.. డేటాను చోరీ చేసి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లలో అత్యధిక సమయాన్ని గడుపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్‌ మాయగాళ్లు.. ఒరిజినల్‌ లింక్స్‌(HTTPS/:)ను తలపించేలా నకిలీవి రూపొందిస్తున్నారు. చిన్న పిల్లలు ఆడే గేమ్స్‌, అశ్లీల వైబ్‌సైట్‌లు, డేటింగ్‌ సైట్‌లు, ట్రేడింగ్‌ సైట్‌లు, కరోనా గురించి తెలుసుకునేందుకు, వివిధ సమాచారానికి చెందిన లింక్‌లను చూస్తున్న సమయంలో ఈ నకిలీ లింక్‌లను పంపిస్తున్నారు. వాటిని క్లిక్‌ చేసిన వెంటనే..డౌన్‌లోడ్‌ అయ్యి సమాచారం  సైబర్‌ మాయగాడికి వెళుతుంది. అలాగే సైబర్‌ నేరగాళ్లు ఇన్సూరెన్స్‌ ఇతర అంశాలతో వృద్ధులకు గాలం వేసి.. దోచేస్తున్నారు.

 ఫోన్‌ నంబర్లను సేకరించి, వీటి వెబ్‌ సైట్‌లకు సంబంధించిన లింక్‌లకు నకిలీ యూఆర్‌ఎల్‌(యూనిఫాం రీసోర్స్‌ లొకేటర్‌)లను పంపిస్తూ కొల్లగొడుతున్నారు. సాధారణంగా ఈ నకిలీ యూఆర్‌ఎల్‌లను తెరవగానే..  అది స్మార్ట్‌ ఫోన్‌లు, కంప్యూటర్లలో ఉండే కుకీస్‌లను హ్యాక్‌ చేస్తుంది.  మన సమాచారంతో ఖాతాలను కొల్లగొడుతుంది.

‘సైబర్‌' దోపిడీ...

 సైబర్‌ క్రిమినల్స్‌.. రోజుకో మోసానికి పాల్పడుతున్నారు. కార్డులు, కేవైసీ అప్‌డేట్‌లతో నిండా ముంచేస్తున్నారు. అలాగే నగరానికి చెందిన పలువురి క్రెడిట్‌ కార్డులను క్లోనింగ్‌చేసి, విదేశాల్లో ఉపయోగించి డబ్బులు కాజేస్తున్నారు. ఇలా మోసపోయిన  నలుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఫేస్‌బుక్‌ ఐడీ మార్చేసి...

సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివాసముండే ఆర్మీ ఉద్యోగి రాహుల్‌, మనోజ్‌గుప్తా స్నేహితులు. వీరు  ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తుంటారు.  మనోజ్‌గుప్తా ఫేస్‌బుక్‌ ఐడీని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌ చేశారు. స్నేహితుడి లాగానే సైబర్‌ క్రిమినల్స్‌ చాటింగ్‌చేసి.. తనకు అత్యవసరంగా రూ. 1.5 లక్షలు అవసరమున్నాయని  చెప్పాడు. దీంతో రాహుల్‌.. లక్ష రూపాయలే ఉన్నాయంటూ.. ఐదు దఫాలుగా సైబర్‌నేరగాళ్లు పంపించిన గూగుల్‌ పేకు బదిలీ చేశాడు. రెండు రోజుల తరువాత మనోజ్‌కు ఫోన్‌ చేసి, డబ్బులు అందాయా అని అడుగగా.. డబ్బులు ఎప్పుడు పంపించావు అన్నాడు. దీంతో రాహుల్‌ జరిగిన విషయం చెప్పాడు. దీంతో రాహుల్‌  సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

కార్డు బ్లాక్‌ అవుతుందంటూ.. 

వారసిగూడకు చెంది సాయికి హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డు ఉంది. ఈ క్రమంలో  బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ కార్డు బ్లాక్‌ అవుతుంది.. వివరాలు చెబితే.. ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేస్తామంటూ నమ్మించారు. కార్డు వివరాలతో పాటు ఓటీపీలు కూడా తెలుసుకొని రూ.1.05లక్షలు కొట్టేశారు. 

 పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో 

బోరబండకు చెందిన ఓ వ్యక్తికి.. పేటీఎం నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి..పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు.  తాము పంపిన లింక్‌లో వివరాలు పొందుపరుచాలంటూ సూచించారు.  ఖాతా వివరాలు, ఓటీపీలు పొందుపరచడంతో   54 వేలు  కాజేశారు. 

విదేశాల్లో డ్రా...

 టోలీచౌక్‌లో నివాసముండే వ్యాపారి క్రెడిట్‌ కార్డును విదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ. 64 వేలు కాజేశారు.  బాధితులు సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వైరస్‌టోటల్‌తో పరిష్కారం

HTTPS/  తో వచ్చే యూఆర్‌ఎల్‌ లింక్‌లు ఒరిజినల్‌వా లేదా నకిలీవా అని తేల్చడానికి.. దీన్ని కాపీ చేసుకుని WWW. VIRUSTOTAL. COM వెబ్‌సైట్‌లో పోస్టు చేసి తనిఖీ చేసుకోవచ్చు. అంతే కాకుండా డాక్యుమెంట్‌లను కూడా పోస్టు చేసుకుని అవి నకిలీవా, ఒరిజినల్‌వా.. అని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ మధ్య ఇలాంటి లింక్స్‌ను ఓపెన్‌ చేసినప్పుడు లింక్‌తో సంబంధం లేకుండా మరో వెబ్‌ పేజీ తెరుచుకుంటుంది. దీన్ని హిడెన్‌ యూఆర్‌ఎల్‌ అంటారు. ఇవి స్పష్టంగా కనపడవు. వీటితో కూడా సైబర్‌ క్రిమినల్స్‌ .. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సమాచారాన్ని దోచేస్తారు. హిడెన్‌ యూఆర్‌ఎల్‌ల గురించి తెలుసుకోవాలంటే లింక్‌లను iplogger.orgలో పోస్టు చేసి హిడెన్‌ యూఆర్‌ఎల్స్‌ గురించి తెలుసుకోవచ్చు.

-సందీప్‌ ముదల్కర్‌, ఐటీ నిపుణుడు


logo