శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 23:50:15

మమ్మల్ని పంపించండి..

మమ్మల్ని పంపించండి..

  • ఠాణాల్లో బారులుతీరిన వలస కార్మికులు
  • వివరాలు సేకరించినపోలీసులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ :  స్వస్థలాలకు వెళ్లేందుకు వివరాల నమోదు కోసం వలస కూలీలు పోలీస్‌స్టేషన్ల బాట పట్టారు. సొంతూర్లకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలంటూ అభ్యర్థించారు. నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో వలస కూలీల వివరాలు నమోదు చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో అధికారులు కూలీల వివరాలు నమోదు చేసుకున్నారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 135 మంది వలస కూలీల  వివరాలు సేకరించారు.  పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ కార్యాలయం, సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌కు  కూలీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇసామియాబజార్‌, వీవీ కాలేజి, బొగ్గులకుంట, హనుమాన్‌ టేక్డీ తదితర ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి కూలీల వివరాలు సేకరించారు.  మాసబ్‌ట్యాంక్‌ చాచానెహ్రూ పార్కు వద్ద హుమాయూన్‌నగర్‌ పోలీసులు వలస కూలీల వివరాలు నమోదు చేసుకున్నారు. కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లోని కూలీలు కాలి నడకన స్వస్థలాలకు వెళ్లొద్దని రెండు, మూడు రోజుల్లో సర్వే చేసి సొంతూర్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ మండపం వద్ద పోలీసులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి సుమారు  200 మంది కూలీల వివరాలు నమోదు చేసుకున్నారు.  సైదాబాద్‌లో 200, మలక్‌పేటలో 350, చాదర్‌ఘాట్‌లో 300 మంది వలస కూలీల వివరాలు సేకరించారు. గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో సుమారు 400 మంది వలస కూలీల వివరాలు నమోదు చేసుకున్నారు. నార్త్‌జోన్‌  పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లకూ వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. logo