బుధవారం 27 మే 2020
Hyderabad - May 04, 2020 , 23:41:25

పోలీసులకు వైద్య పరీక్షలు

పోలీసులకు వైద్య పరీక్షలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నియంత్రణకు పోరాటం చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్న పోలీసులకు వారి ఆరోగ్యంతో పాటు ప్రజల భద్రత, కుటుంబం సంరక్షణ కూడా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పోలీస్‌ సిబ్బందికి  గత ఏప్రిల్‌ 10న వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 1575 మంది సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. దాదాపు 19 పోలీస్‌ స్టేషన్‌లు, 48 చెక్‌పోస్టుల వద్ద సిబ్బందికి వైద్యులు అవినాష్‌, వరుణీ కృష్ణ, నగేశ్‌, శ్రీనివాస్‌లు పరీక్షలు నిర్వహించారు.  అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సీ విటమిన్‌, జింక్‌ టాబ్లెట్లు,  చవాన్‌ప్రాష్‌లను అందించారు. అనుమానం ఉన్న 40 మంది సిబ్బందిని కొవిడ్‌ పరీక్షలకు పంపించామని.. మేడిపల్లి కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ రాగా మిగతా వారిని కూడా హోం క్వారంటైన్‌లోకి పంపినట్లు సీపీ వివరించారు. ఈ వైద్య సేవలను అధికారుల నుంచి ఎస్పీఓల వరకు అందిస్తునామన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి- అంజనీ కుమార్‌

బొల్లారం/మారేడ్‌పల్లి: కరోనా వైరస్‌  విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్‌ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ సూచించారు. సోమవారం కంటోన్మెంట్‌లోని బొల్లారం చెక్‌పోస్టు, తిరుమలగిరి ఠాణాను సీపీ సందర్శించారు. పికెట్‌, జూబ్లీబస్టాండ్‌, చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బ్యాగులు, వాటర్‌ బాటి ల్స్‌, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నార్త్‌ జోన్‌ పరిధిలో పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదని, ఈ సందర్భంగా నార్త్‌ జోన్‌ పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు.  కార్యక్రమంలో నార్త్‌ జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగనవార్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, మహంకాళీ ఏసీపీ వినోద్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ రంగయ్య పాల్గొన్నారు. 

జర్నలిస్ట్‌ల సేవలు భేష్‌ -సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

సిటీబ్యూరో: కరోనా నియంత్రణలో వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులతో పాటు జర్నలిస్ట్‌ల సేవలు కూడా అభినందనీయమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ అన్నారు. సోమవారం జర్నలిస్ట్‌లు రూపొందించిన కరోనా - జర్నలిస్ట్‌ ఆన్‌ మిషన్‌  24/7 షార్ట్‌ ఫిలింను సీపీ ఆవిష్కరించారు. పెద్ద కెమెరాలు వాడకుండా కేవలం మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఈ ఫిలింను రూపొందించినట్లు జర్నలిస్ట్‌ ఇన్నారెడ్డి అన్నారు.కరోనా నియంత్రణకు రోడ్లపై ఉండి కాపలా కాస్తున్న పోలీసులకు హెచ్‌ఏఎల్‌ (హిందుస్తాన్‌ ఎయిరోనాటిక్స్‌ లిమిటడ్‌) అధికారులు, వారి కుటంబాలు తయారు చేసిన మాస్క్‌లను అందించారు. సోమవారం కమిషనర్‌ సజ్జనార్‌కు దాదాపు వెయ్యి హోంమేడ్‌ మాస్క్‌లను అందజేశారు.

అబిడ్స్‌: స్వచ్ఛంద కార్యక్రమాల్లో హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ముందంజలో ఉంటుందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పేర్కొన్నారు. సోమవారం హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ అధినేత శ్రీకాంత్‌మోర్లవార్‌ సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసి హోమియో ప్రివెంటివ్‌ మెడిసిన్‌కు సంబంధించిన ఆరు వేల కిట్లను అందజేశారు. కార్యక్రమంలో అభినయ్‌ మోర్లవార్‌, సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo