శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 01:25:01

నిత్య సేవకులు... నీరాజనాలు

నిత్య సేవకులు... నీరాజనాలు

కరోనా పోరులో అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు వాయుసేన నీరాజనాలు పలికింది. వారి సేవలను కొనియాడుతూ పూల వర్షం కురిపించింది. గాంధీలో పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, పేషెంట్‌ కేర్‌ అసిస్టెంట్లు, వార్డు బాయ్‌లు, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది, పరిపాలనా విభాగం ఉద్యోగులు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వరకు భౌతిక దూరం పాటించి నిలబడగా... వాయుసేన హెలికాఫ్టర్‌ ద్వారా వారిపై పూలవాన కురిపించింది. ఆ తర్వాత నల్లకుంట ఫీవర్‌ దవాఖాన సిబ్బందిపైనా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులకు సదరన్‌ స్టార్‌ ఆర్మీ వారియర్స్‌ రాజ్‌పుత్‌ 19 బెటాలియన్‌ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత వాయుసేన, రక్షణ దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, నార్త్‌ జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింఘన్వార్‌, సికింద్రాబాద్‌ జడ్సీ శ్రీనివాస్‌ రెడ్డి, బేగంపేట్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ముకుందరెడ్డి, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు, డిప్యూటి సూపరింటెండెంట్‌లు నర్సింహారావు నేత, శోభన్‌బాబు, ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ రేణుక, డాక్టర్లు కృష్ణనాయక్‌, సునీల్‌, సునీత, పార్మసిస్టు జె.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

- సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్‌/అంబర్‌పేట

గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావుకు ఆదివారం సాయంత్రం తన నివాసం వద్ద అపార్ట్‌మెంట్‌ వాసులు ఇలా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కరోనా బాధితులకు రాజారావు ఆధ్వర్యంలోని వైద్యులు అందిస్తున్న సేవలను అభినందించారు. 

గాంధీ దవాఖానలో వాయుసేన పూలవర్షం కార్యక్రమం ముగిసిన అనంతరం గాంధీ వైద్య కళాశాల వైరాలజీ విభాగం ఇన్‌చార్జి డాక్టర్‌ జ్యోతిలక్ష్మి, ఎస్‌పీఎం హెడ్‌ డాక్టర్‌ విమలతామస్‌, ఇతర వైద్యులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు అభినందించారు.

ఖైరతాబాద్‌ :  కొవిడ్‌ 19 పరీక్షలను నిర్వహిస్తున్న నిమ్స్‌ మైక్రోబయాలజీ వైద్య సిబ్బందిని ఆదివారం ఆర్మీకి చెందిన వైద్యాధికారులు  సత్కరించారు. ఈ సందర్భంగా ఆ విభాగం వైద్యాధికారి డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌కు ఆర్మీ వైద్యశాల ప్రధాన వైద్యాధికారి వరుణ్‌ తేజ్‌ గిఫ్ట్‌ను అందజేశారు. 

బండ్లగూడ : కరోనా వ్యాధి నిర్మూలన కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేమని కేకేనగర్‌ కాలనీవాసులు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న అంజలి తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి కాలనీ వాసులందరూ కలిసి రోడ్డుకు ఇరువైపులా ఉండి ఆమెకు చప్పట్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమెను సన్మానించి పూలమాలతో అభినందనలు తెలిపారు.logo