ఆదివారం 31 మే 2020
Hyderabad - May 04, 2020 , 00:58:42

రక్తదాతా..ప్రణామం...

రక్తదాతా..ప్రణామం...

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు అనేక మంది ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. ఆదివారం నగరంలోని పలు చోట్ల నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో యువకులు, దివ్యాంగులు, నేతలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కొంపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌,  ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  శిబిరంలో సుమారు  200 మంది, నిజాంపేట కార్పొరేషన్‌ మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కొలన్‌ గొపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కొలన్‌ రాఘవరెడ్డి గార్డెన్‌లో 186 మంది యువకులు రక్తదానం చేశారు. మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో శిబిరాన్ని ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేగాంధీ,  ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశం ప్రారంభించారు.50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సంగర్‌ జాతి సంఘ్‌ విద్యానగర్‌ కమిటీ ఆధ్వర్యంలో నల్లకుంట డివిజన్‌ సత్యానగర్‌ కమిటీహాల్‌లో ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. 60 మంది రక్తదానం చేశారు. యూసుఫ్‌గూడలోని మహమూద్‌ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన శిబిరానికి ఎమ్మెల్యే గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ హాజరయ్యారు. రక్తదాతల్లో మహిళలు, దివ్యాంగులు కూడా ఉండడం విశేషం. దాతలకు పండ్లు, సర్టిఫికెట్లను అందజేశారు.


logo