బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:55:23

మళ్లీపెరిగిన కేసులు

మళ్లీపెరిగిన కేసులు

 • వనస్థలిపురం ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతుండడంతో అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మరిన్ని కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.   ఇప్పటికే  పాజిటివ్‌ కేసులు నమోదైన ఇంజినీర్‌కాలనీ, వనస్థలిపురం ఏ, బీ టైపు క్వార్టర్లు, వనస్థలిపురం ఫేజ్‌ -1, సచివాలయంనగర్‌ కాలనీ, ఎస్‌కేబీనగర్‌లను నియంత్రిత జోన్లుగా ప్రకటించగా, తాజాగా ఆదివారం హుడాసాయినగర్‌ కాలనీలో ఉండే ఓ  వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో హుడాసాయినగర్‌, సుష్మాసాయినగర్‌, కమలానగర్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లు చేశారు. రాకపోకలను నియంత్రించామని, వారం రోజుల పాటు వనస్థలిపురం రైతు బజారును మూసేస్తున్నట్లు వెల్లడించారు. 
 • ఓ అపార్టుమెంట్‌లో పనిచేసే వాచ్‌మన్‌కు వైరస్‌ సోకడంతో బేగంపేటలోని కుందన్‌బాగ్‌ను కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. లోపలికి వెళ్లే దారుల్లో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా బల్దియా సిబ్బంది నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. 
 • నిత్యం రద్దీగా ఉండే మలక్‌పేట మార్కెట్‌లో ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు. తొలుత పంచదార వ్యాపారం నిర్వహించే అక్బర్‌బాగ్‌ ప్రొఫెసర్స్‌ కాలనీకి చెందిన ఇద్దరు వ్యాపారులకు పాజిటివ్‌ వచ్చింది. మరుసటి రోజు మార్కెట్లో ఆయిల్‌ వ్యాపారికి పాజిటివ్‌ తేలింది. కేవలం  ఐదురోజుల్లోనే పంచదార వ్యాపారుల కుటుంబాల్లో 11 మందికి వైరస్‌ సోకింది. ఇంతలోనే మార్కెట్‌కు చెందిన ఓ వ్యాపారి, హమాలీ కరోనా లక్షణాలతో మృతిచెందారు. అప్రమత్తమైన అధికారులు మార్కెట్‌ను రెడ్‌జోన్‌గా గుర్తించి మూసివేశారు. వ్యాపారులు, కూలీలు తదితరులకు స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోడియం హైపోక్లోరైట్‌  పిచికారీతో పాటు, పారిశుధ్యం, ఫాగింగ్‌ పనులు చేస్తున్నారు. 
 • నాంపల్లి నియోజకవర్గంలోని కంటైన్మెంట్‌  ప్రాంతాల్లో ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌, కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్‌తో కలిసి పర్యటించారు.  ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 
 • మెహిదీపట్నం రైతుబజార్‌కు వచ్చిన పలువురికి వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించగా, బోజగుట్టకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను దవాఖానకు తరలించారు. 
 • బోరబండ డివిజన్‌ బంజారానగర్‌లో కిరాయికి ఉంటున్న ఓ వ్యక్తి కొన్ని రోజులు కనిపించకుండా వెళ్లి తిరిగొచ్చాడు.  వైద్యసిబ్బంది అతని చేతికి స్టాంప్‌ వేశారు. అతనితో పాటు కుటుంబసభ్యులను రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌ చేశారు. 
 • రాంకోఠిలో నివాసముండే వృద్ధుడు కరోనాతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. 
 • జూబ్లీహిల్స్‌ సర్కిల్‌ పరిధిలో రాజీవ్‌నగర్‌, జయంతినగర్‌, వెంకటగిరి, బోరబండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లను క్లియర్‌ చేశామని బల్దియా డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. 
 • మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అంబర్‌పేట చెన్నారెడ్డినగర్‌కు చెందిన కానిస్టేబుల్‌కు వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.   అతని కుటుంబసభ్యులు తల్లిదండ్రులతో పాటు మొత్తం ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది.
 • జియాగూడలోని సాయిదుర్గానగర్‌లో ఇటీవల వైరస్‌ సోకిన బల్దియా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కుటుంబసభ్యులైన ఐదుగురికి పాజిటివ్‌ తేలింది. దుర్గానగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ తేలగా, ఆదివారం చనిపోయాడు.  
 • ఖైరతాబాద్‌ ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌ ప్రాంతంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

గ్రేటర్‌లో 20కేసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో కరోనా కేసుల పరంపర కొనసాగుతోంది. శివారు ప్రాంతాల కంటే నగరంలోని పాతబస్తీలో కేసులు సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆదివారం గ్రేటర్‌ వ్యాప్తంగా 20కేసులు నమోదయ్యాయి. ఇందులో 15కేసులకు పైగా హైదరాబాద్‌ నగరంలోనివేనని అధికారులు తెలిపారు. మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి నాలుగురోజుల క్రితం పాజిటివ్‌ రాగా తాజాగా ఆయన నివాసముంటున్న అంబర్‌పేటలోని ఆయన కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. జియాగూడలో ఒకరు, సుల్తాన్‌బజార్‌లో ఒకరికి పాజిటివ్‌ రాగా... వారిద్దరూ మృత్యువాత పడ్డారు.


logo