సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:30:22

లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌..

లాక్‌డౌన్‌ రూల్స్‌ బ్రేక్‌..

  • పెరిగిన మూడు కిలోమీటర్ల ఉల్లంఘనలు
  • సాంకేతికతతో గుర్తిస్తున్న ట్రాఫిక్‌,లా అండ్‌ ఆర్డర్‌
  • రోజూ 1800కుపైగా కేసులు
  • 14.23 లక్షల చలాన్లు, 1.60 లక్షల 

వాహనాలు సీజ్‌సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌లో మీరు మూడు కిలోమీటర్ల పరిధి దాటుతున్నారా? పోలీసులు పటిష్ట నిఘాతో కేసులు వేస్తున్నారు.. ఒక పక్క సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌తో పాటు మరో పక్క ట్రాఫిక్‌ విభాగం చేతిలో ఉన్న ఇతర అప్లికేషన్లతో ఈజీగా ఈ ఉల్లంఘనను పోలీసులు గుర్తిస్తున్నారు. ప్రతి రోజు ట్రాఫిక్‌ పోలీసులు 15 వందల వరకు మూడు కిలోమీటర్ల పరిధి దాటిన వాహనాలను గుర్తిస్తున్నారు. ఇలా ప్రతి రోజు సుమారు 1800 వరకు మూడు కిలోమీటర్ల పరిధి దాటిన వారిపై పోలీసులు చలాన్లు విధిస్తున్నారు.

నంబర్‌ ఎంట్రీ చేశారంటే..  

ట్రాఫిక్‌ పోలీసుల చేతిలో ఉండే ట్యాబ్‌లో ఒక వాహనం నంబర్‌ ఎంట్రీ అయ్యిందంటే.. అది మూడు కిలోమీటర్ల పరిధి దాటిన తరువాత ఉండే చెకింగ్‌ పాయింట్‌ వద్దకు వెళ్లగానే పోలీసులకు సిగ్నల్స్‌ ఇస్తుంది. రెండో చెక్‌పాయింట్‌ వద్ద ఆ వాహన నెంబర్‌ ఫీడ్‌ చేస్తే వెంటనే ఆ వాహనం మూడు కిలోమీటర్ల పరిధి దాటిందనే విషయం పోలీసులకు చెప్పేస్తుంది.   కేవలం ఇది వాహనం నంబర్‌ ఆధారంగానే గుర్తిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కువగా ఈ సాంకేతికతతో మూడు కిలోమీటర్ల పరిధి దాటిన విషయాన్ని గుర్తిస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌తో వాహనదారుడి చిరునామా, ఆధార్‌కార్డు ఆధారంగా ఉల్లంఘనను గుర్తిస్తున్నారు.  

 హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 1.1 లక్షల వాహనాలు సీజ్‌

 లాక్‌డౌన్‌ సమయంలోను ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు వారిగా వేలల్లో ఉంటుంది. కాంటాక్టు, నాన్‌ కాంటాక్ట్‌ పద్ధతిలో ప్రతి రోజు నగర ట్రాఫిక్‌ పోలీసులు సుమారు 13 వేల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదు చేస్తున్నారు.  హైదరాబాద్‌ కమిషనరేట్‌లో లాక్‌డౌన్‌ ప్రారంభమైన సుమారు 40 రోజుల్లో  6.15 లక్షల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు నమోదు చేయగా, 1.1 లక్షల వాహనాలను సీజ్‌ చేశారు.

రాచకొండ, సైబరాబాద్‌లో 59,200 వాహనాలు

  రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే ఈ చలాన్‌లు 8.08 లక్షలు, వాహనాల జప్తు అర లక్ష దాటాయి.  రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మార్చి 23 నుంచి మే 1 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం 1248 కేసులు నమోదు చేసి దాదాపు 14834 వాహనాలను జప్తు చేసుకున్నారు. ఇక ట్రాఫిక్‌ పోలీసులు  6995 వాహనాలను సీజ్‌ చేశారు. 1.16 లక్షల ఈ చలాన్‌లను జారీ చేశారు. మొత్తం 22 వేల వాహనాలు పోలీసుల ఆధీనంలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. 

సైబరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై 1506 కేసులను నమోదు చేసి 18652 వాహనాలను జప్తు చేశారు. ఇక ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై  ఈ చలాన్లు దాదాపు 692996 జారీ చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు 18719 రోడ్లపైకి వచ్చిన వాటిని జప్తు చేసి కేసులను నమోదు చేశారు.


logo