బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 03, 2020 , 00:26:19

15 అడుగులకు మించొద్దు

15 అడుగులకు మించొద్దు

  • ఇండ్ల రూఫ్‌ టాప్‌పై ప్రకటనలు నిషేధం
  • అతిక్రమిస్తే రోజుకు  రూ. లక్ష చొప్పున జరిమానా 
  • అనుమతుల జారీకి త్రిసభ్య కమిటీ..
  • కొత్త మార్గదర్శకాలు జారీచేసినబల్దియా కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌

పభుత్వం ఇటీవల జారీచేసిన కొత్త హోర్డింగుల విధానం ప్రకారం నగరంలో నూతన హోర్డింగులకు అనుమతులు జారీచేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అయితే, ఈ కొత్త విధానం ప్రకారం హోర్డింగులు భూమి నుంచి 15 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఉండేలా చూడాలని నిశ్చయించారు. ఇండ్ల రూఫ్‌ టాప్‌పై ప్రకటన బోర్డులు ఏర్పాటును పూర్తిగా నిషేధించారు. అక్రమ హోర్డింగులకు రోజుకు రూ. లక్ష వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ మార్గదర్శకాలను జారీచేశారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గాలివానలకు కూలిపోయి ప్రమాదాలు జరగడం, నగర అందాలను హరించే విధంగా ఉండటంవల్ల హోర్డింగులను భూమి నుంచి 15అడుగుల ఎత్తువరకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయిస్తూ ఇటీవలే ప్రభుత్వం కొత్త హోర్డింగుల విధానాన్ని ప్రకటించింది. అందులో భాగంగా నూతన హోర్డింగులకు అనుమతులు మంజూరు చేయడంతోపాటు ఇప్పటికే ఎక్కువ ఎత్తుగా ఉన్న హోర్డింగులను 15 అడుగులకు పరిమితం చేయాలని నిశ్చయించారు. ఈ కొత్త విధానం హోర్డింగులు, యూనీపోల్స్‌, యూనీ-స్ట్రక్చర్స్‌, నియోన్‌/గ్లో సైన్‌ బోర్డులు, ఆర్చీలు, వాల్‌ పెయింటింగ్స్‌, ఫ్లెక్సీ బోర్డులు, గ్లాస్‌ బోర్డులు, షాప్‌ షట్టర్లు, లాలీపాప్స్‌, బస్‌ షెల్టర్లు, బెలూన్స్‌, మొబైల్‌ యాడ్స్‌(బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు మొదలగునవి) తదితర ప్రకటనలకు వర్తిస్తుంది. 15అడుగులకన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న హోర్డింగులు, ఇండ్లపై ఉన్న హోర్డింగులను వెంటనే తొలిగించాలని నిర్ణయించారు. ఒకవేళ పాత హోర్డింగుల అనుమతి గడువు ఇంకా ఉంటే అది పూర్తయ్యాక తొలిగించాలని నిశ్చయించారు. పబ్లిక్‌, రోడ్‌ సేఫ్టీ, నగర అందాలను కాపాడడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నిబంధనలు రూపొందించారు. దృఢత్వ ధ్రువీకరణకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి సమర్పించాల్సి ఉంటుంది. 

ఈ ప్రాంతాల్లో ప్రకటనలు నిషేధం 

 చారిత్రక కట్టడాలు, వాటి ప్రహరీలు, జలాశయాల పక్కన, నాలాలు, శిఖం భూములు, బ్రిడ్జీలు తదితర ప్రాంతాల్లో ప్రకటన బోర్డుల ఏర్పాటును నిషేధించారు. అంతేకాకుండా ప్రకృతిసిద్ధంగా ఇంటిలోకి వచ్చే వెలుతురును అడ్డుకునే విధంగా ఉండే ప్రకటన బోర్డులను కూడా అనుమతించరు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద, ఇండ్ల రూఫ్‌ టాప్‌పై, మెట్రోరైలు నిర్వహణలో అంతరాయం కలిగే ప్రాంతాల్లో కూడా ప్రకటన బోర్డుల ఏర్పాటును నిషేధించారు. 

ప్రకటనలపై ఆంక్షలు

  కొత్త విధానం ప్రకారం ప్రకటనలపై అనేక ఆంక్షలు విధించారు.  ఇందులో ముఖ్యంగా  కుల,  మతాలను కించపర్చే విధంగా ఉండే ప్రకటనలు, జంతువులను హిం సించే విధంగా చిత్రీకరించిన ప్రకటనలు, నగ్న చిత్రాలు, అశ్లీలంగా ఉండేవి, హింసను ప్రోత్సహించేవి, మహిళలు, పిల్లలపై హింస, డ్రగ్స్‌, ఆల్కహాల్‌, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు తదితర ప్రకటనలను నిషేధించారు. దేశాన్ని, ఏదైనా సంస్థను, ఇతరులను కించ పరిచే విధంగా ఉండే ప్రకటనలు, అసభ్య కరమైన చిత్రాలు, రాతలు,గ్రాఫిక్స్‌, ఆయుధాలు, ఆయుధాలకు సంబంధించినవి తదితరవాటితోపాటు ప్రభుత్వాలు నిషేధించే ప్రకటనల ఏర్పాటును పూర్తిగా నిషేధించారు.  

అతిక్రమిస్తే భారీ జరిమానాలు..

 అక్రమంగా హోర్డింగులు భూమి నుంచి 15 అడుగుల కన్న ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేస్తే రోజుకి రూ.లక్ష, అలాగే 15 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉన్నా అక్రమ హోర్డింగులు ఏర్పాటు చేస్తే రోజుకు రూ.50వేలు జరిమా నా విధించాలని నిర్ణయించారు. అనుమతి లేకుండా హోర్డింగుపై లైట్లు ఏర్పాటు చేస్తే రూ. 50వేలు, కదిలే ప్రకటనలు, రొటేట్‌ అయ్యే ప్రకటనలు ఏర్పాటు చేస్తే రోజుకు రూ.10 వేలు, దృఢత్వ నిర్థారణ సర్టిఫికెట్‌ లేకుండా ఏర్పాటు చేసే ప్రకటన బోర్డుకు రోజుకు రూ. 50 వేలు, బోర్డుపై అనుమతించిన దానికన్నా ఎక్కువ వెలుగులు ఉండేలా లైట్లు ఏర్పాటు చేస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. 

 ప్రకటనల అనుమతికి కమిటీ.. 

 కొత్త హోర్డింగుల విధానం ప్రకారం ప్రకటనల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రకటనల విభాగం అదనపు కమిషనర్‌ నేతృత్వంలో నగర ముఖ్యప్రణాళికాధికారితోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు.  


logo