బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 03, 2020 , 00:16:06

మొక్కలను సంరక్షించండి..

మొక్కలను సంరక్షించండి..

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీఎం దత్తత గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. తాను తనిఖీ చేసిన సమయంలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఏ మాత్రం బాగలేవని కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. శనివారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సీఎం దత్తత గ్రామాల (లక్ష్మాపూర్‌, కేశవరం, మూడుచింతలపల్లి, నాగిశెట్టిపల్లి, లింగాపూర్‌తండా)ల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ నర్సరీల్లో సుమారు 85శాతం మొక్కలను సంరక్షించి వచ్చే హరితహారానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటి సంరక్షించాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా నీరు, సేంద్రియ ఎరువులను మొక్కలకు సరఫరా చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలుంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామం, కమ్యూనిటీ హాల్‌, డంపింగ్‌యార్డు పనులను త్వరగా పూర్తి చేయాలని, గుంతలుగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. లక్ష్మాపూర్‌లో నిర్మిస్తున్న మార్కెట్‌ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. చెరువులకు అవసరమైన చోట మరమ్మతులను చేయించాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు ఏ మేరకు పని చేస్తున్నాయి, రైతులకు అందించిన వ్యవసాయ పనిముట్లను రైతులు ఏ మేరకు వాడుతున్నారో గుర్తించి తమకు నివేదిక అందించాలని  జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని, సీఎం దత్తత గ్రామాల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లకు మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, సీపీవో సౌమ్యా, పంచాయతీ రాజ్‌ ఈఈ రామ్మోహన్‌, ఈఅండ్‌బీ ఈఈ చందర్‌సింగ్‌, ఇరిగేషన్‌ ఏడీ మంజుల, మార్కెటింగ్‌ అధికారి చాయాదేవి, వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ తదితరులు పాల్గొన్నారు. 

మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి

మేడిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అందుకే మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ అన్నారు. శనివారం ఘట్‌కేసర్‌ మండలం కాచవానిసింగారం గ్రామ పంచాయతీలోని నర్సరీని ఆయన మండల అధికారులతో కలిసి పరిశీలించారు. 


logo