సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 23:16:56

చేపల కొరత లేదు..

చేపల కొరత లేదు..

హైదరాబాద్‌/సిటీబ్యూరో : చేపల ధర లు నియంత్రణలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని  మంత్రి తలసాని అధికారులను  ఆదేశించారు. శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయం కాన్ఫరెన్స్‌హాల్‌లో  కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా లాక్‌డౌన్‌ సమయంలోనూ కొరత లేకుండా చేపలు లభ్యమవుతున్నాయన్నారు. ముషీరాబాద్‌ (రాంనగర్‌)లోని హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ వారంలో మూడు రోజులు పనిచేస్తున్నదని, ఈ మార్కెట్‌కు 80 నుంచి 90 మెట్రిక్‌ టన్నుల చేపలు  వస్తున్నాయని, దీంతో నగర ప్రజల అవసరాలకు చేపలు లభిస్తున్నాయన్నారు.  రాష్ట్రంలో  నీటి వనరులు పెద్ద ఎత్తున పెరగడంతో ప్రభుత్వం చేపట్టిన  ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో మత్స్యసంపద కూడా పెరిగిందని మంత్రి వివరించారు. నూతనంగా ఏర్పాటైన 33 జిల్లాల వారీగా జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ను మరో విశాలమైన స్థలానికి మార్చే విషయాన్ని పరిశీలించాలని, ఇందుకోసం సీనియర్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ఆదేశించారు.  అంతేకాకుండా దశలవారీగా జిల్లా ల్లో చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులకు సూచించారు. ఈ సందర్భం గా నాణ్యమైన చేపల సరఫరాలో మత్స్యఫెడరేషన్‌కు ఉన్నతమైన గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని  పేర్కొన్నారు.


గొర్రెల ధరలు పెంచొద్దు

ఇష్టానుసారంగా గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి తలసాని హెచ్చరించారు. శనివారం ఆయన చెంగిచర్ల, జియాగూడ, బోయగూడ మండీలలో గొర్రెల విక్రయదారులతో సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం నిర్ణయించిన రూ.700 కంటే అధిక ధరకు విక్రయిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాల నుంచి వచ్చే గొర్రెల వాహనాలకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురౌతున్న నేపథ్యంలో పాసులు ఇప్పించాలని కోరారు. 


logo