శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 01:13:40

రెడ్‌జోన్‌లో సిటీ

రెడ్‌జోన్‌లో సిటీ

  • అప్రమత్తమైన అధికారులు 
  • కరోనా రహితంగా మార్చేందుకు చర్యలు 
  • మరింత కఠినంగా నిబంధనలు

సిటీబ్యూరో/మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: : గ్రేటర్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలను రెడ్‌జోన్‌గా ప్రకటిస్తూ..కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్‌లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌  నిబంధనలు మరింత కఠినంగా అమలు చేసేందుకు సమయత్తమవుతున్నారు. కాగా, లాక్‌డౌన్‌ నిబంధనలను 100 శాతం పాటించి కరోనా రహిత జిల్లాగా మార్చడంలో  ప్రజలు భాగస్వామ్యం కావాలని మేడ్చల్‌ కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారమిక్కడ  ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు పాజిటివ్‌ కేసులున్నాయని, ఆ ఏరియాలను ఇప్పటికే కంటైన్మెంట్‌  ప్రాంతాలుగా గుర్తించి జనసంచారాన్ని పూర్తిగా నిషేధించామని చెప్పారు.  రెడ్‌జోన్‌ పరిధిలో నిబంధనలు మరింత కఠినంగా అమలవుతాయని, పోలీసులకు, వైద్య, రెవెన్యూ అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం 47 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేయడంతో వాటి సంఖ్య 61కి పరిమితమైంది. ప్రస్తుతం ఎల్బీనగర్‌ జోన్‌లో-4, చార్మినార్‌-23, ఖైరతాబాద్‌-21, సికింద్రాబాద్‌-9, శేరిలింగంపల్లి-1, కూకట్‌పల్లి-3, మొత్తం-61 కంటైన్మెంట్లు కొనసాగుతున్నాయి. 

  • ఉస్మాన్‌గంజ్‌లో క్లినిక్‌ నిర్వహించే ఆగాపురాకు చెందిన వైద్యుడికి వైరస్‌ సోకింది. అప్రమత్తమైన వైద్యాధికారులు అతడి కుటుంబసభ్యులను, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నలుగురు అద్దెదారులను హోం క్వారంటైన్‌ చేసి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ చేశారు. 
  • మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా రావడంతో పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు. అతని వెంట ఉన్న డీఐతో పాటు ఎనిమిది మంది సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వైరస్‌ సోకిన కానిస్టేబుల్‌ది అంబర్‌పేట కావడంతో అతని ఇంటి సమీపంలోని మరో తొమ్మిది మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
  • నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బోడుప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోయాడు. సదరు వ్యక్తికి కొద్ది రోజులుగా దగ్గు, జలుబు ఎక్కువ గా ఉండడంతో మేడిపల్లి పోలీసులు అతనిని గత నెల 24న కింగ్‌కోఠి దవాఖానకు తరలించారు. ఆ తర్వాత తిరిగి అతడు ఇంటికి వెళ్లేందుకు అంబులెన్స్‌ లేకపోవడంతో ఆరు రోజులుగా బొగ్గుల కుంట ప్రాంతంలో తిరిగి ఫుట్‌పాత్‌పై పడిపోయారు.  గురువారం రాత్రి స్థానికులు  పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆ వ్యక్తి వివరాల కోసం పరిశీలించగా, కింగ్‌ కోఠి దవాఖాన వైద్యులు చెస్ట్‌ వైద్యశాలకు రిఫర్‌ చేస్తూ.. రాసి ఇచ్చిన చీటి అతని జేబులో లభించింది.  మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 
  • నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల నుంచి నలుగురిని వైద్యాధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వట్టినాగులపల్లి గ్రామంలో ఓ మహిళకు  కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమెతో పాటు ఇద్దరు పిల్లలను కింగ్‌ కోఠి దవాఖానకు తరలించారు. పుప్పాలగూడ తిరుమల హిల్స్‌కాలనీలో ఉండే యువకుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అతడిని కందుకూరులోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు వైద్యాధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు. 
  • కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని భాగ్యలక్ష్మీనగర్‌లో ఓ యువకుడికి వైరస్‌ సోకడంతో గాంధీ దవాఖానకు తరలించారు. అతడితో పాటు ఉంటున్న యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో  కింగ్‌కోఠి దవాఖానకు పంపించారు. జీహెచ్‌ఎంసీ ఏఎంవోహెచ్‌ హేమలత, డాక్టర్‌ రవికుమార్‌, గాంధీనగర్‌ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మీనగర్‌ను సందర్శించారు. 113 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 

మరో ఆరు కేసులు..

గ్రేటర్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో ఒకటి

సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదులో హెచ్చుతగ్గుల పరంపర కొనసాగుతున్నది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గినా.. గురువారం ఒక్కసారిగా 22కు చేరడంతో కలకలం రేపింది. తాజాగా శుక్రవారం గ్రేటర్‌ పరిధిలో కేవలం ఐదు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవ్వడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రేటర్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు నమోదైంది. logo