శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:16:35

కేంద్ర బృందం పర్యటన

కేంద్ర బృందం పర్యటన

సిటీబ్యూరో : నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం పర్యటించింది. పేట్లబుర్జు ప్రభుత్వ దవాఖానను సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయానికి చేరుకొని కంటైన్మెంట్ల నిర్వహణపై చర్చించారు. ఆ తర్వాత ఎర్రమంజిల్‌లో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఏర్పాటు చేసిన వలస కార్మికుల వసతిని సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఉప్పల్‌లో నెలకొల్పిన డీఎన్‌ఏ, ఫింగర్‌ ప్రింట్‌ అండ్‌ డయోగ్నస్టిక్స్‌ కేంద్రాన్ని సందర్శించారు.

మల్కాజిగిరి: మల్కాజిగిరి అనూస్‌ ఫౌండేషన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ. 10కే మాస్కులను విక్రయిస్తున్నారు. ప్యూర్‌కాటన్‌ రెండు లేయర్లతో నాణ్యమైన మాస్కులను తయారు చేస్తున్నట్లు ఫౌండేషన్‌ వ్యవస్థపకురాలు సంధ్య తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ంఎసీ, పోలీస్‌ సిబ్బందికి ఉచితంగా మాస్కులను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మెహిదీపట్నం:  లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది కోసం చల్లని తాగునీటిని అందించడానికి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం హుమాయూన్‌నగర్‌ పోలీసులకు ప్లాస్కులను అందజేశారు.

మారేడ్‌పల్లి :  మోండా మార్కెట్‌లో వ్యాపారుల కోసం హిమాన్షు అనే దాత సాయంతో రూ. 8 లక్షలతో  ఏర్పాటు చేసిన ఆర్వో (మంచినీరు) ప్లాంట్‌ను  శుక్రవారం  మంత్రి తలసాని ప్రారంభించారు.  

సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌లో అర్చనలు, పూజలు చేసుకునే వీలును కల్పించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం, ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఈ అవకాశం కల్పించగా శనివారం నుంచి తాడ్‌బండ్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీనగర్‌ కాలనీలోని వేంకటేశ్వర స్వామి, కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆలయంల్లో అర్చనలు, పూజలు చేయించుకోవచ్చు.

అమీర్‌పేట్‌: తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తూ గ్లోబల్‌ ట్రీ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటి ఉచిత లైవ్‌ వెబ్‌నెయిర్‌ యూకే వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ శుక్రవారం జరిగింది. యూకేకు చెందిన దాదాపు 20 విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో తెలుగు రాష్ర్టాలకు చెందిన దాదాపు 750 మంది విద్యార్థులు వెబ్‌ ద్వారా ముఖాముఖి సంప్రదింపులు జరిపారు.

సిటీబ్యూరో : అసలే లాక్‌డౌన్‌... ఠారెత్తిసున్న ఎండలు.. జనమంతా ఇండ్లల్లోనే...దీనికి తోడు నగరంలో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి సైనిక్‌పురి, జీడిమెట్ల, మేడ్చల్‌, హబ్సిగూడ, అంబర్‌పేట, విద్యానగర్‌, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం తలెత్తింది. మొత్తంగా గ్రేటర్‌ వ్యాప్తంగా 82 ఫీడర్లల్లో అంతరాయం ఏర్పడగా, విద్యుత్‌శాఖ సిబ్బంది, అధికారులు కలిసి 42 ఫీడర్లల్లో అరగంటలోపే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.  


logo