శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 01, 2020 , 23:43:39

రక్తదానం చేయాలి: మంత్రి ఈటల

రక్తదానం చేయాలి: మంత్రి ఈటల

ఉప్పల్‌/మల్లాపూర్‌/సికింద్రాబాద్‌/ఎర్రగడ్డ/ హఫీజ్‌పేట్‌: మల్లాపూర్‌లో హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో చేపట్టిన మేడే కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్‌ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నాచారంలో టీఆర్‌ఎస్‌కేవీ ఆటోయూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య జెండా ఆవిష్కరించారు. సీతాఫల్‌మండిలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ నేత గరికపాటి చంద్రశేఖర్‌, మణిమంజరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి రక్తం ఎంతో అవసరమన్నారు. రహ్మత్‌నగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో రెండో రోజు రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన తలసాని సాయికిరణ్‌యాదవ్‌ శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. మదీనాగూడలో రంజిత్‌ యువసేన, శ్రీస్కంద చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.

ఖైరతాబాద్‌ : మేడే సందర్భంగా నిమ్స్‌ లో కాంట్రాక్ట్‌ కార్మికులు జెండాను ఎగుర వేసి అనంతరం రక్తదానం చేశారు.


logo