గురువారం 28 మే 2020
Hyderabad - Apr 30, 2020 , 23:47:51

ఇక్కడే బాగుంది

ఇక్కడే బాగుంది

  • చక్కని వసతి.. నాణ్యమైన భోజనం
  • వైద్యపరీక్షల నిర్వహణ.. మందుల అందజేత 
  • వలస కార్మికులకు ఆపద్బంధువైన షెల్టర్‌ హోమ్స్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం.. ఇదీ షెల్టర్‌హోమ్స్‌ల్లో అందుతున్న సౌకర్యాలు. దీంతో ఆశ్ర యం పొందుతున్న వలస కార్మికులు తమ సొంతూర్లకు వెళ్లేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన భోజనం, చక్కని సౌకర్యాలు ఓ కారణమైతే, లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఇక్కడే పనులు చేసుకోవాలన్నది వారి ఆలోచనగా ఉన్నది. 

మందులు సైతం... 

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని 12 షెల్టర్‌ హోమ్‌లు కొనసాగుతుండగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో అదనంగా మరో 18 తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తాత్కాలిక షెల్టర్‌ హోమ్స్‌ల్లో 495 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఫుట్‌పాత్‌లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి వీరిని ఇక్కడకు తరలించారు. అల్పాహారం, రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. దాతలు రోజూ పండ్లు, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే వారికి వైద్య  పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు  ఈ షెల్టర్‌హోమ్స్‌లో ఉన్నారని, తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నప్పటికీ   ఎవ్వరూ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు తెలిపారు. 

మిగిలిన సరుకులు.. కిట్ల రూపంలో 

లాక్‌డౌన్‌తో మూతబడిన సంక్షేమ వసతిగృహాల్లో మిగిలిపోయిన నిత్యావసర సరుకులు, వస్తు సామగ్రిని వినియోగంలోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా సరుకులను కిట్ల రూపంలోకి మార్చి వలసకూలీలకు అందజేయనుంది. శుక్రవారం నుంచి వాటిని సేకరించి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో  147 వసతిగృహాలున్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ, మరికొన్ని మేనేజ్‌ మెంట్‌ హాస్టళ్లు (విద్యార్థులే నడుపుకొనేవి). జనతా కర్ఫ్యూకు ముందే ప్రభుత్వ ఆదేశాలతో వీటన్నింటిని మూసివేశారు.  అయితే విద్యార్థుల కోసం తెప్పించిన బియ్యం, పప్పులు, నూనెలు సహా ఇతర నిత్యావసరాలన్నీ వసతిగృహాల్లోనే నిల్వ ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయాశాఖల అధికారుల నుంచి సమగ్ర నివేదికను తెప్పించగా, ప్రాథమిక అంచ నా ప్రకారం 3900 కేజీల బియ్యం సహా 46 రకాల వస్తువులున్నట్లు తేలింది. వీటన్నింటిని తమకు అందజేయాలని జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి సంక్షేమశాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్‌ ఆర్డీవో శ్రీను మరికొంత మంది నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాల్లో  నిత్యావసరాల పంపిణీ ప్రక్రియనంతా పూర్తిచేస్తామని ఆర్డీవో శ్రీను తెలిపారు.

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మేయర్‌

బన్సీలాల్‌పేట్‌: బన్సీలాల్‌పేట్‌లోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాలులోని పునరావాస కేంద్రాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గురువారం సందర్శించారు. 150 మంది అనాథలు, నిరా శ్రయులకు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 1994 బ్యాచ్‌ విద్యార్థుల సహకారంతో భోజనాన్ని, మాస్కులను, శానిటైజర్లను కార్పొరేటర్‌ కె.హేమలత, మేయర్‌ సతీమణి శ్రీదేవిలతో కలిసి పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ ద్వారా 27 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని, 97 స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రోజూ 2 వేల మందికి భోజనం పెడుతున్న పబ్లిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులను,అలాగే రోజు 500మందికి అన్నదానం చేస్తున్న లక్ష్య క్యాటరింగ్‌ సంస్థను మేయర్‌ అభినందించారు. డీపీవో నీరజాదేవి, ఏఈ వెంకటస్వామి, యూసీడీ సీవో చండికేశ్వరం, టీఆర్‌ఎస్‌ నాయకుడు కె.లక్ష్మీపతి, ఆశ్రిత ఎన్జీవో పర్వతాలు పాల్గొన్నారు. logo