ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 30, 2020 , 23:45:18

నమ్మించి..ముంచుతున్నారు

నమ్మించి..ముంచుతున్నారు

సిటీబ్యూరో: సైబర్‌నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. మాయమాటలతో నమ్మించి నట్టేటా ముంచేస్తున్నారు. సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన యువకుడు ఓ డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. ఇటీవల అతడికి యజమాని పంపించినట్లు ఓ నకిలీ మెయిల్‌ వచ్చింది. అందులో తాను రెండు గంటల పాటు సమావేశంలో ఉంటున్నానని, అత్యవసరంగా తన ఖాతాలోకి 20 వేల రూపాయలు పంపాలని కోరినట్లు ఉన్నది.  నిజమేనని నమ్మిన ఆ ఉద్యోగి డబ్బును సూచించిన ఖాతాలో బదిలీ చేశాడు. మరో సారి అదే రకంగా 30 వేలను డిపాజిట్‌ చేయాలని మరో మెయిల్‌ వచ్చింది. అనుమానంతో బాధితుడు సీసీఎస్‌ సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.  అక్షరం తేడాలో మెయిల్‌ పంపి సైబర్‌ నేరగాళ్లు మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. మరో కేసులో వాక్యూమ్‌ క్లీనర్‌ను సెకండ్‌ సేల్స్‌లో అమ్మాలని ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇవ్వగా, సైబర్‌ నేరగాళ్లు అతని నుంచి 75 వేలు దోచుకున్నారు.  మరో యువకుడు సైతం ఓఎల్‌ఎక్స్‌లో ఓ ద్విచక్రవాహనాన్ని ఖరీదు చేసేందుకు అందులోని నంబరును సంప్రదించి రూ. 78 వేలు పోగొట్టుకున్నాడు. సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  25 వేల మాస్కుల కోసం ఆర్డర్‌ ఇచ్చి పురానాపూల్‌కు చెందిన ఓ హోల్‌సేల్‌ వ్యాపారిని నిందితులు బురిడీ కొట్టించాడు. సదరు వ్యాపారికి ఫోన్‌ చేసి 25 వేల మాస్కులు కావాలని అడ్వాన్సు కింద రూ. 50 వేలు పంపిస్తున్నానని అజ్ఞాత వ్యక్తి ఓ క్యూర్‌ కోడ్‌ ను పంపాడు. దానిని స్కాన్‌ చేయగా వ్యాపారి ఖాతా నుంచి 50 వేలు మాయమయ్యాయి. 

పెండ్లికి నిరాకరించిందని వేధింపులు..

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన గవని సంజయ్‌రాజుకు రెండున్నర ఏండ్ల కింద ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆమెతో చాటింగ్‌ చేయడంతో పాటు వ్యక్తిగత ఫొటోలను పంపించుకున్నారు. ఆ తర్వాత సంజయ్‌ చేసిన పెండ్లి ప్రతిపాదనను యువతి కాదనడంతో అప్పటి నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, అభ్యంతరకరమైన ఫొటోలు పంపడం ప్రారంభించాడు. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


logo