శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 30, 2020 , 23:25:31

అద్దె కోసం వేధిస్తే చర్యలు

అద్దె కోసం వేధిస్తే చర్యలు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

అమీర్‌పేట్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ముందు నుంచే హాస్టళ్లు మూతపడిన పరిస్థితుల్లో నిర్వాహకులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని, ఈ పరిస్థితుల్లో యజమానులు తమను అద్దెల కోసం పీడిస్తున్నారంటూ గ్రేటర్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి తలసానిని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. గ్రేటర్‌ పరిధిలో దాదాపు 5వేలకు పైగా హాస్టళ్లున్నాయని, వీటిలో దాదాపు 4లక్షల మంది వరకు వసతి సదుపాయం పొందుతుండగా, 50వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని, తాజా పరిస్థితుల్లో సిబ్బందికి వేతనాలే చెల్లించలేని పరిస్థితులు ఒకవైపు తమను ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు భవన యజమానులు అద్దెల కోసం వేధిస్తున్నారని మంత్రికి వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి అద్దెల కోసం భవన యజమానులు ఇబ్బందులు పెట్టడం సరికాదని,  ప్రభు త్వం ఇప్పటికే స్పష్టత నిచ్చిందన్నారు. ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. గ్రేటర్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అమర్‌నాథ్‌రెడ్డి, కాకు మధుసూదన్‌యాదవ్‌, కరుణాకర్‌, మహీదర్‌, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పనులపై సమీక్ష

బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల పురోగతిపై గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణారావు, జీహెచ్‌ఎంసీ ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డితోపాటు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ఆస్తులు కోల్పోతున్నవారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు సహకరించాలని ఆస్తుల యజమానులకు విజ్ఞప్తిచేశారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు లాక్‌డౌన్‌ను మించిన సమయం మళ్లీ రాదని అన్నారు. జీహెచ్‌ఎంసీ వెంటనే వారికి టీడీఆర్‌ సర్టిఫికెట్లు జారీచేస్తుందని మేయర్‌ వివరించారు.


logo