గురువారం 28 మే 2020
Hyderabad - Apr 29, 2020 , 23:52:55

అలుపెరగకుండా

అలుపెరగకుండా

కరోనాపై పోరులో.. రెవెన్యూ సేవలు

  • వలస కార్మికులకు సౌకర్యాల కల్పన
  • హోం క్వారంటైన్ల పర్యవేక్షణ
  • అనుమానితుల గుర్తింపు
  • బియ్యం, నగదు పంపిణీ

సిటీబ్యూరో/ మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి: కరోనా కట్టడికి రెవెన్యూ యంత్రాంగం విశేషంగా కృషి చేస్తున్నది. వలస కూలీలు, పేదలకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు కొవిడ్‌-19 అనుమానితులను గుర్తించి, హోం క్వారంటైన్ల కోసం సర్వేలైన్స్‌ టీంల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నది. వలస కార్మికులు, రేషన్‌కార్డుదారులకు బియ్యం, నగదు పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నది.

వలస కూలీలకు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ప్రభుత్వమే ఆదుకుంటున్నది. వీరికి వసతులు కల్పించే బాధ్యతను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు నిత్యం వలస కూలీల స్థితిగతులను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీరికి 12 కిలోల బియ్యం, రూ. 500 అందిస్తున్నారు. 

నిరంతర సేవలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన  వైద్య అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్‌ల దృష్ట్యా రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్‌ శ్వేతా మహంతి సెలవులు రద్దు చేశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది అంతా జిల్లాలోనే ఉంటున్నారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. 

 ‘కరోనా’ సేవలు.. 

  • విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానితులను గుర్తించడం.
  • క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలు సిద్ధం చేయడం
  • పాజిటివ్‌ కేసుల వ్యక్తులను గాంధీ దవాఖానకు తరలించడం.

అందరితో మమేకమై

ఆపత్కాలంలో అందరితో మమేకమై కరోనా విధులు నిర్వహిస్తున్నం. కలెక్టరేట్‌లో 24 గంటల పాటు కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి ఏ రాత్రి ఫోన్‌ వచ్చినా వెంటనే స్పందిస్తూ వారి అవసరాలను తీర్చుతున్నం. కరోనా కట్టడికి కృషి చేస్తున్నాం.

-మధుకర్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా రెవెన్యూ అధికారి.

ఇబ్బందులు లేకుండా..

లాక్‌డౌన్‌లో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వసతితో పాటు కార్మికులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. తెల్లరేషన్‌ కార్డు లేని వారికి బియ్యం పంపిణీపై సివిల్‌ సైప్లె అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నాం. 

- బాలశంకర్‌, తహశీల్దార్‌, సికింద్రాబాద్‌

బాధ్యతగా భావిస్తున్నం

అందరిలాగే మాకు ప్రాణభయం ఉన్నప్పటికీ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మాకు అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వహిస్తున్నం. కష్టకాలంలో  ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పం పెరిగింది.

-గోవర్ధన్‌, తహసీల్దార్‌, శామీర్‌పేట 

ఫిర్యాదుకు స్పందిస్తున్నాం..

ప్రతి ఫిర్యాదుకు స్పందించి కార్మికులు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు అందిస్తున్నాం. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూనే ఆపత్కాలంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా సేవలందిస్తున్నాం.

-రామకృష్ణ/నాంపల్లి, తహసీల్దార్‌ logo