గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 29, 2020 , 23:49:48

రద్దీ నిల్‌.. పనులు ఫుల్‌

రద్దీ నిల్‌.. పనులు ఫుల్‌

  • రూ.30 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, స్కైవేలు, రోడ్ల నిర్మాణాలు 
  • పనులను పరిశీలించిన మంత్రి తలసాని 

సిటీబ్యూరో/బషీర్‌బాగ్‌/బేగంపేట్‌ : నగరంలో రూ.30 వేల కోట్లతో  ఫ్లై ఓవర్లు, స్కైవేలు, బీటీ రోడ్లు, వీడీసీసీ రహదారుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. నెక్లెస్‌రోడ్‌లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ. 26 కోట్లతో ఆరు కిలోమీటర్ల మేర చేపట్టిన వీడీసీసీ రోడ్డు పనులను పర్యవేక్షించారు. మురుగు నీటి సమస్య  పరిష్కారానికి సికింద్రాబాద్‌ బోట్స్‌ క్లబ్‌ వద్ద రూ.25 లక్షలతో 250 మీటర్ల మేర డ్రైనేజీ పైపులైన్‌ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ముషీరాబాద్‌-కవాడిగూడ రోడ్డులో భోలక్‌పూర్‌, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో  మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.5 కోట్లతో 550 మీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ కరోనా కట్టడి చర్యలతో పాటు అభివృద్ధి పనులపైనా దృష్టి కేంద్రీకరించారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో  రోడ్లపై రద్దీ లేకపోవడంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, నార్త్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, ఎస్‌ఈ అనిల్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 ‘లింకు రోడ్లు’  ఇక వేగవంతం 

లింకు రోడ్ల నిర్మాణం కోసం ఆస్తులు ఇచ్చేందుకు యజమానులు మేయర్‌ సమక్షంలో అంగీకారం తెలిపారు. దీంతో వాటి నిర్మాణానికి మార్గం సుగమం అయింది.  బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జీకి రెండు వైపులా చేపట్టిన రోడ్ల విస్తరణలో అడ్డంకిగా మారిన ఆస్తులు, హోర్డింగ్స్‌, యూనిపోల్స్‌ను తొలగించే అంశంపై వాటి యజమానులు, నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి, ఏసీపీలతో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చర్చించారు.  అలాగే, రవాణాను సులభతరం చేసేందుకు మల్కంచెరువు, మల్కాపూర్‌, జూబ్లీహిల్స్‌, జవహర్‌నగర్‌, మాదాపూర్‌, ఫతుల్లగూడ తదితర ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌డీసీ కింద లింకు రోడ్లు నిర్మించేందుకు సేకరించాల్సిన ఆస్తుల యజమానులతో కూడా మేయర్‌ మాట్లాడారు. ఆయా ప్రాంతాల భూముల విలువ ఆధారంగా వెంటనే టీడీఆర్‌లు జారీచేస్తామని హామీ ఇచ్చారు. 

నాణ్యతతో క్యాపింగ్‌ పనులు 

జవహర్‌నగర్‌ : కార్పొరేషన్‌లోని రాంకీ డంపింగ్‌ యార్డుకు రూ.144 కోట్లుతో నాణ్యతతో క్యాపింగ్‌ పనులు చేపడుతున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి క్యాపింగ్‌ పనులతో పాటు దమ్మాయిగూడ నుంచి హరిదాస్‌పల్లి వరకు వందఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. జవహర్‌నగర్‌ మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo