శనివారం 30 మే 2020
Hyderabad - Apr 29, 2020 , 23:44:49

‘పైసలిస్తే..బండ్లు ఇడిపిస్తం’

‘పైసలిస్తే..బండ్లు ఇడిపిస్తం’

  • సీజ్‌ అయిన వాహనాలను విడిపిస్తామంటూ రంగంలోకి దిగిన దళారులు
  • అవన్నీ నమ్మొద్దని పోలీసుల హెచ్చరిక
  • 100కు ఫోన్‌ చేయాలని సూచన 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. ఈ వాహనాలు రిలీజ్‌ కావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు.. దీంతో కొంతమంది దళారులు రంగంలోకి దిగి.. డబ్బులు ఇస్తే..వాహనాలను విడిపిస్తామంటూ వాహనదారులను నమ్మిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి వారిని నమ్మొద్దని.. ఎవరైనా వాహనాలను విడిపిస్తామంటే వెంటనే 100కు ఫోన్‌ చేయాలని కోరుతున్నారు. 

 నగరంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘనలతోపాటు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు  చేసి.. ఇప్పటి వరకు 75 వేలకుపైగానే వాహనాలను సీజ్‌ చేశారు. ఈ వాహనాలను ఆయా పోలీస్‌స్టేషన్లతోపాటు  స్థానికంగా ఉండే ఫంక్షన్‌ హాల్స్‌, గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేశారు. కోర్టులో డిపాజిట్‌ చేయాల్సిన ఈ వాహనాలను పోలీసులు వదిలి పెట్టడం లేదు.

రంగంలోకి దళారులు...

సీజ్‌ అయిన వాహనాలను కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆర్సీ, లెసెన్స్‌లు డిపాజిట్‌ చేసుకొని వదిలేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు రంగంలోకి దిగారు. డబ్బులు ఇస్తే.. సీజ్‌ అయిన వాహనాలను విడిపిస్తామని వాహనదారులను నమ్మిస్తున్నారు. కొందరు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారని సమాచారం. ఈ విషయం ఆయా స్టేషన్‌ ఉన్నతాధికారుల వరకు వెళ్లకుండా.. ఆయా స్టేషన్లలో ఉండే కార్యాలయం పనులు నిర్వహించే సిబ్బంది దళారులు కలిసిపోయి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దళారులు సౌత్‌జోన్‌లోని పలు ఠాణాల చుట్టూ తిరుగుతూ వాహనాలను ఇడిపించే దందాను సాగిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా వాహనం ఇప్పిస్తామంటూ చెబితే డయల్‌ 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.  


logo