బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 29, 2020 , 23:44:13

గిర్రున తిరుగుతున్నయ్‌!

గిర్రున తిరుగుతున్నయ్‌!

  • వేసవి ధాటికి వేగం పెరిగిన కరెంటు మీటర్లు
  • ఏప్రిల్‌ మొదటి వారంతో పోలిస్తే..
  • కోటి యూనిట్ల వరకు అదనపు వినియోగం
  • లాక్‌డౌన్‌కు తోడైన ఎండాకాలం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇంతకాలంగా తగ్గుతూ వచ్చిన విద్యుత్‌ వినియోగం క్రమంగా పెరుగుతున్నది. డిమాండ్‌ అధికంగా ఉండటంతో వినియోగం సైతం క్రమంగా పెరుగుతున్నది.. ఈ సీజన్‌లోనే గరిష్ఠానికి చేరుకున్నది. ఏకంగా కోటి యూనిట్లు (10 మిలియన్‌ యూనిట్లు ) వినియోగం పెరిగి 4. 59 కోట్ల యూనిట్ల  (45.9 మిలియన్‌ యూనిట్లు ) చేరుకున్నది. జనతా కర్ఫ్యూ నుంచి గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పడిపోతూవస్తున్నది. లాక్‌డౌన్‌ మొదట్లో  వినియోగం కోటి యూనిట్ల (10 మిలియన్‌ యూనిట్లు )  పడిపోయి  3.2 కోట్ల - 3. 4 కోట్ల యూనిట్లు ( 32 -34 మిలియన్‌ యూనిట్లకు) చేరుకున్నది. లాక్‌డౌన్‌ ప్రకటించడం, విడతల వారీగా పొడిగించడంతో విద్యుత్‌ వినియోగం సైతం తగ్గుతూ వస్తున్నది. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్‌ మొదటి వారం వరకు అదే పరిస్థితి కొనసాగగా, సరాసరిగా 3. 7 -3. 8 కోట్ల యూనిట్ల్ల (37 -38 ఎంయూ) వరకు వినియోగమయ్యింది. ఏప్రిల్‌ రెండు, మూడో వారం నుంచి వినియోగం క్రమంగా పెరుగుతూ.. చివరి వారానికి గరిష్ఠానికి చేరుకున్నది. తాజాగా ఒక కోటి యూనిట్ల (10 మిలియన్‌ యూనిట్ల) మేర పెరిగి 4.8 కోట్ల యూనిట్లకు (48 మిలియన్‌ యూనిట్లకు) చేరుకున్నది. ఈనెల 23న సీజన్‌లోనే గరిష్ఠంగా 4.59 కోట్ల యూనిట్ల వినియోగానికి చేరుకోవడం గమనార్హం. 

ఉష్ణోగ్రతలతోనే..

ఇక గత పక్షం రోజులుగా గ్రేటర్‌లో ఎండలు పెరిగాయి. ప్రత్యేకించి మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. పైగా రాత్రిపూట ఉక్కపోత సైతం కలవరపెడుతున్నది. దీంతో వీటి  నుంచి బయటపడేందుకు జనం ఎయిర్‌ కండిషనర్లు (ఏసీ), కూలర్లను వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రాత్రి పగలు తేడాల్లేకుండా ఏసీలు, కూలర్లు వాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్‌ వినియోగం పెరిగిందని డిస్కం అధికారులు అంటున్నారు. అంతే కాకుండా.. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, కమర్షియల్‌ లోడ్‌ తగ్గినా, ఫార్మా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, కోల్డ్‌స్టోరేజ్‌ యూనిట్లు, ఐటీ కంపెనీల డేటా సెంటర్లు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లోడ్‌ సైతం పెరిగింది. 

వర్క్‌ ఫ్రం హోమ్‌తో..

 లాక్‌డౌన్‌ను విడతల వారీగా పొడిగించడం, ఇప్పట్లో సడలింపులకు అవకాశం లేకపోవడంతో కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.  సాఫ్ట్‌వేర్‌ సహా పలు ప్రైవేట్‌ రంగ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నారు. దీంతో  విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంతో పొల్చితే లాక్‌డౌన్‌ రోజుల్లో గృహ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లుగా డిస్కం అధికారులు పేర్కొన్నారు. పలు ఫీడర్లల్లో అధ్యయనం చేయగా, గత నెలతో పొల్చితే 15 - 20 శాతం గృహ విద్యుత్‌ వినియోగం పెరిగినట్లుగా తేలిందంటున్నారు. వీటన్నింటి ప్రభావంతో విద్యుత్‌ వినియోగం పై పైకి పోతుండగా, మే మాసంలో వినియోగం మరింతగా పెరుగుతుందని డిస్కం అధికారులు అంచనాలేస్తున్నారు.logo